31 July, 2026 | 12:41 AM

చెత్త సేకరణ పేరిట ప్రజలపై అదనపు భారం వద్దు

06-06-2026 04:50 PM

- ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెంటనే రద్దు చేయాలి

- మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేసిన  గజ్వేల్ బీజేపీ నాయకులు

గజ్వేల్: గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో చెత్త సేకరణ బాధ్యతలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించే నిర్ణయాన్ని వెంటనే రద్దు చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, గజ్వేల్–ప్రజ్ఞాపూర్ పట్టణ బీజేపీ అధ్యక్షుడు దేవులపల్లి మనోహర్ యాదవ్ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఇప్పటికే ఆస్తి పన్నులు, నల్లా బిల్లులు, ఇతర సేవల ఛార్జీలతో ప్రజలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, చెత్త సేకరణ పేరుతో మరో అదనపు భారం మోపడం సమంజసం కాదన్నారు.

ప్రజలకు మెరుగైన సేవలు అందించాల్సిన మున్సిపల్ శాఖ ప్రైవేటీకరణ పేరుతో ప్రజలపై భారాలు పెంచడం తగదని విమర్శించారు. మున్సిపల్ పరిధిలో అనేక సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయని, వాటి పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. తూప్రాన్ రోడ్డులో ఉన్న కోట్ల రూపాయల విలువైన మున్సిపల్ భూములను పరిరక్షించి స్వాధీనం చేసుకోవడంతో పాటు, ప్రజ్ఞాపూర్ పునరావాస కాలనీలో స్మశానవాటిక ఏర్పాటు కోసం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా చెత్త సేకరణ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకుని ప్రజలపై అదనపు ఆర్థిక భారం పడకుండా చూడాలని వారు కోరారు.