పని ప్రదేశాల్లో మహిళలను వేధిస్తే సహించం
- సీపీ రష్మీ పెరుమాళ్
- లింగ వివక్షతపై అవగాహన
సిద్దిపేట క్రైం: పని ప్రదేశాల్లో మహిళల పట్ల వేధింపులను ఏమాత్రం సహించబోమని పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ హెచ్చరించారు. విధి నిర్వహణలో ప్రతి ఒక్కరూ క్రమశిక్షణను పాటించాలని సూచించారు. బుధవారం సిద్దిపేట పోలీస్ కన్వెన్షన్ హాల్‌లో జిల్లా పోలీస్ యంత్రాంగం ఆధ్వర్యంలో లింగ వివక్షతపై ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీపీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తోటి సిబ్బంది పట్ల గౌరవ మర్యాదలతో మెలగాలని సూచించారు. విధి నిర్వహణలో ఒకరిపై ఒకరు అనుచిత వ్యాఖ్యలు చేసుకోకూడదని హితవు పలికారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే మహిళా ఫిర్యాదుదారులతో గౌరవంగా మాట్లాడాలని, వృత్తిపరమైన విలువలను కాపాడాలని సూచించారు.
కార్యక్రమం ప్రారంభంలో 'షీ టీమ్స్' ఆధ్వర్యంలో మహిళల భద్రత, రక్షణపై రూపొందించిన పలు అవగాహన వీడియోలను ప్రదర్శించారు. అనంతరం మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ దుర్గ సమాజంలో, పని ప్రదేశాల్లో లింగ సమానత్వం ఎంత ముఖ్యమో వివరించారు. పని ప్రదేశాల్లో మహిళలపై జరిగే వేధింపులకు వ్యతిరేకంగా ఉన్న చట్టాలు, మహిళా హక్కులపై న్యాయవాది రియాజుద్దీన్ అవగాహన కల్పించారు. అనంతరం సీపీ రష్మీ పోలీస్ సిబ్బందితో మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విధి నిర్వహణలో ఎదురవుతున్న సవాళ్లు, వ్యక్తిగత ఇబ్బందుల గురించి ఆరా తీశారు. సిబ్బంది సంక్షేమానికి తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.కార్యక్రమంలో అదనపు డీసీపీ అడ్మిన్ కుశాల్కర్, అదనపు డీసీపీ ఏఆర్ సుభాష్ చంద్రబోస్, ఏసీపీ రవీందర్ రెడ్డి, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.






