చెట్టుని ఢీకొట్టిన ఆటో
ముగ్గురికి గాయాలు.. భద్రాద్రి జిల్లా కోయగూడెంలో ఘటన
బూర్గంపాడు, మే23 (విజయక్రాంతి): వైద్యపరీక్షలు చేయించుకునేందుకు వెళుతుండగా ఆటో అదుపుతప్పి చెట్టును ఢీకొనగా ముగ్గురికి తీవ్రగాయాలైన సంఘటన మండల పరిధిలోని కోయగూడెం సమీపంలో శనివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు మేరకు కరకగూడెంకు చెందిన అడెపు సతీష్ తన భార్య స్వప్న, కుమారుడు మనోహర్‌తో కలిసి చిరుమళ్లకి చెందిన వ్యక్తి ఆటోలో భద్రాచలం ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యపరీక్షలు చేయించుకునేందుకు వెళుతున్నారు.
ఆటో మండల పరిధిలోని కోయగూడెం సమీపంలోకి రాగానే ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి అదుపుతప్పడంతో ఆటోను డ్రైవర్ రహదారికి పక్కనే ఉన్న చెట్టుకు ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న సతీష్, స్వప్న, మనోహర్‌కు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు వారిని భద్రాచలంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. వీరిలో మనోహర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.






