లెక్కపత్రాల్లేవ్!
ఉజ్జయినీ మహంకాళీ ఆస్తులు హాంఫట్?
రూ. 500 కోట్ల విలువైన భూమి కబ్జా.. కనిపించని డాక్యుమెంట్లు
2.132 కిలోల బంగారు అభరణాలూ మాయం
మహంకాళీ ఆలయంలో అధికారుల ఇష్టారాజ్యం
దేవాదాయ శాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేసిన తెలంగాణ రాష్ట్ర దేవాలయ పరిరక్షణ సమితి
నిర్లిప్తంగా దేవాదాయ శాఖ
హైదరాబాద్, మార్చి ౨ (విజయక్రాంతి): వందల ఏళ్ల చరిత్ర.. తెలుగు రాష్ట్రాల్లో అశేషమైన భక్తులు కొలిచే సికింద్రాబాద్‌లోని ఉజ్జయినీ మహంకాళీ ఆస్తులు హాంఫట్ అయ్యాయా? ఆలయ భూముల పత్రాలు, ఆభరణాలు మాయమయ్యాయా? ఆస్తులు, ఆభరణాల లెక్కపత్రాలే లేవా.. అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. వందల కోట్ల విలువైన దేవాలయ భూమి కబ్జాకు గురవుతున్నా.. ఆ భూమికి సంబంధించిన డాక్యుమెంట్లు మాయమైనట్టుగా ప్రచారం జరిగినా.. ప్రభుత్వంలో చలనం లేదు.
అంతేకాకుండా.. భక్తులు సమర్పించుకున్న కానుకలకు సంబంధించిన 2.132 కిలోగ్రామాలు బంగారు అభరణాలుకూడా కనిపించడం లేదనే ఆరోపణలు భక్తుల తీవ్ర ఆవేదనకు కారణమవుతున్నాయి. గడిచిన కొంత కాలంగా ఉజ్జయినీ మహంకాళీ దేవాలయంలో జరిగిన అక్రమాలు, అవకతవక లు, మాయాజాలంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి, దేవాలయం ఆస్తులు, అభరణాలను రికవరీ చేయాలని తెలంగాణ రాష్ట్ర దేవాలయ పరిరక్షణ సమితి ప్రెసిడెంట్ నాగిల్ల శ్రీనివాస్ దేవాదాయ శాఖ కమిషనర్‌కు పూర్తి వివరాలతో ఫిర్యాదు చేశారు. అయినా దేవాదాయ శాఖ నుంచి ఎలాంటి చర్యలు, విచారణ చేపట్టకపోవడంతో అనుమానాలు మరింత బలపడుతున్నాయి.
భూమికి రక్షణ ఏదీ.. డాక్యుమెంట్లు ఎక్కడ?
ఉజ్జయినీ మహంకాళీ ఆలయం రిజిస్ట్రేషన్ ఫైల్ (17/2 ఆఫ్ 1356 ఫస్లీ (1946) ప్రకారం దేవాలయానికి సికింద్రాబాద్‌లోని భోలక్‌పూర్ గ్రామ శివారు సర్వే 92లో ఒక ఎకరం 37 గుంటల స్థలం (9,317 చదరపు గజాలు) ఉంది. ఈ స్థలం విలువ ప్రస్తుతం రూ. 500 కోట్ల వరకు ఉంటుంది. కానీ ప్రస్తుతం దేవాలయం స్వాధీనంలో కేవలం 1,350 చదరపు గజాల స్థలం మాత్రమే ఉంది. మిగిలిన స్థలం మొత్తం ఆక్రమణకు గురయ్యింది.
ఈ ఆక్రమణలను తొలగించి పూర్తి స్థలాన్ని సంరక్షించాల్సిన బాధ్యత ఉన్న ఈఓ, దేవాదాయ శాఖ చర్యలు తీసుకోవడం లేదు. పైగా.. రూ. 500 కోట్ల విలువై న స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్లు దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయం నుంచి మాయమవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వాస్తవానికి దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయం నుంచి ఈ మహంకాళీ దేవాలయానికి సంబంధించిన ఫైళ్లే కాదే. స్థిర, చరాస్తులకు సంబంధించిన వివరాలన్నీ మాయమయ్యాయి.
బంగారం దారిలోనే.. వెండికూడా..
మహంకాళీ దేవాలయం ట్రస్ట్ బోర్డు సమావేశం 2018 మే 10న జరిగింది. ఈ సందర్భంగా పవిత్రమైన గర్భాలయం వెలుపల వెండి ఫలకలను తాపడం చేయించా లని, ఇందుకు భక్తుల నుంచి కానులక రూపంలో వచ్చిన 103.435 కిలోల వెండి నుంచి 74.816 వెండిని వినియోగించాలని నిర్ణయించారు. ఇదే సందర్భంలో గర్భాలయానికి మిగతా మూడు వైపుల వెండి ఫలకలను తాపడం చేయించడానికి వీలుగా. 28.380 కిలోల వెండిని బహూకరించారు.
అయితే అప్పటి ఈవోకు అధికారం లేకపోయినప్పటికీ.. వెండి ఫలకాలు చేయించ డానికిగాను లేబర్ ఛార్జీలుగా 3.810 కిలోల వెండిని కేటాయించడం గమనార్హం. ఇదిలా ఉండగా.. 2021 నవంబర్ 22న సికింద్రాబాద్‌లోని ఇండియన్ బ్యాంక్‌లో ఉన్న దేవాల యం లాకర్‌ను తెరవడానికి వెళితే తాళం మాయమయ్యింది. దీనితో ఉన్నతాధికారుల అనుమతితో లాకర్‌ను బద్దకు కొడితే.. అందులోని బంగారు అభరణాలు మొత్తం మాయమైనట్టుగా అధికారులు గుర్తించారు.
అంతా మాయామర్మమే..
2013 ఆర్థిక సంవత్సరంలో ఉజ్జయినీ మహంకాళీ ఆలయానికి రూ. 40 లక్షల మొత్తాన్ని కల్యాణోత్సవం/బ్రహ్మోత్సవం చేయడానికి కేటాయించారు. ఇం దులో నుంచి రూ.15 లక్షలను తెప్పోత్సవానికి ఖర్చు చేసినట్టుగా చూపెట్టారు. అయితే తెప్పోత్సవరం నిర్వహించడానికి ఆలయం పరిధిలో, చుట్టుపక్కల గానీ ఎలాంటి జల వనరులు లేకపోయినప్పటికీ రూ.15 లక్షలను ఖర్చు చేశారని చెప్పడంపై భక్తులు మండిపడుతున్నారు.
జీహెచ్‌ఎంసీ నుంచి అనుమతి తీసుకోకుండానే రూ.3లక్షలతో మండపాన్ని నిర్మించి, ఆ తర్వాత కూల్చివేత తంతు కూడా పూర్తి చేశారు.
1.1.2015 నుంచి 17.3.2016 మధ్యలో ఆలయ ఈవో మొత్తం రూ. 10.43 లక్షలను స్వయంగా డ్రా చేశారు. దీనికి లెక్కలు లేవు.
ఉజ్జయినీ మహంకాళీ ఆలయంలో ఇంతగా మాయామర్మాలు జరుగుతున్నా.. ఏ ఒక్కరూ స్పందించడం లేదు. 2001 నుంచి 2021 వరకు ఎలాంటి ఆడిట్ చేయలేదు. దీనిని బట్టి నిరంతరాయంగా దేవాలయం స్థిర, చరాస్థులను అక్రమం గా తరలించే, మాయం చేసే ప్రక్రియ జరుగుతందనే ఆందోళనను భక్తులు వెలిబుచ్చుతున్నారు.
2.132 కిలోల బంగారు అభరణాలూ అంతేనా?
దేవాదాయ, ధర్మాదాయ చట్టం ప్రకారం ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి దేవాలయానికి వచ్చిన కానుకలు (బంగారం, వెండి లాంటివి) లెక్కించాల్సి ఉంటుంది. కానీ ఉజ్జయినీ మహంకాళీ దేవాలయానికి సంబంధించి 2001 నుంచి 2022 వరకు కేవలం నాలుగుసార్లు మాత్రమే ఈ బంగారు, వెండి అభరణాల కానుకలను లెక్కించారు. కానీ వాటికి సంబంధించిన సరైన లెక్కలు బయటపెట్టలేదు. అధికారిక ప్రకటనలూ లేవు.
2009 నుంచి 2016 మధ్యలో మొత్తం ఐదుగురు ఈవోలు ఇక్కడ పనిచేశారు. 2010 2016 మధ్యలో వచ్చిన కానులకలకు సంబంధించిన బంగారు, వెండి అభరణాలు తరువాత వచ్చిన ఈవోలకు హ్యాండోవర్ చేయలేదు. 2016లో వచ్చిన ఈవోకు మొత్తం బంగారు, వెండి అభరణాలను హ్యాండోవర్ చేసినట్టు, వాటిని బ్యాంకుల లాకర్లలో దాచిపెట్టినట్టుగా స్పష్టంగా తెలియజేశారు. అయితే, జాబితాలో అంతకు ముందు రికార్డుల్లో పేర్కొన్న 2.132 కిలోగ్రాముల బంగారు అభరణాలు లేకపోవడం ఆశ్చర్యకరం.
పాత రికార్డుల్లో పేర్కొన్న బంగారు అభరణాలన్నీ.. కొత్తగా ప్రకటించిన జాబితాలో (2016లో) లేకపోవడంతో భక్తులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. మాయమైన బంగారు అభరణాల్లో 123 గ్రాముల బంగారు మిశ్రాం, 103 గ్రాముల బంగారు బిస్కెట్, 163 గ్రాముల బంగారం, 63 గ్రాముల బంగారు పుష్పాలు, 570 గ్రామాలు బంగారు మిశ్రమం లాంటివి మొత్తం 76 బంగారు అభరణాలు మాయమైనట్టుగా భక్తులు స్పష్టంగా చెబుతున్నారు.




