కీసరలో ‘భూ’ చోళ్లు!?
- ఖాళీ జాగా కనిపిస్తే కబ్జా
- నకిలీ డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్
- పదుల సంఖ్యలో ముఠాలు
- రూ. 100 కోట్ల పైన ఆస్తికి నకిలీ పత్రాల సృష్టి
- సబ్ రిజిస్ట్రార్ రెహమాన్ కుమ్మక్కు
- ఇప్పటివరకు 84 మంది అరెస్టు, మరికొందరి పరారీ
మేడ్చల్, మే 10 (విజయ క్రాంతి): నకిలీ పత్రాలు సృష్టించి భూములు, ఇళ్ల స్థలాలను కబ్జా చేయడం, విక్రయించడం వంటి మోసాలు మేడ్చల్ జిల్లా కీసర ప్రాంతంలో తరచూ వెలుగు చూస్తున్నాయి. ప్లాటు యజమాని ఎక్కడో ఉండి ఇక్కడికి రాకుంటే చాలు దానికి నకిలీ పత్రాలు సృష్టించి కబ్జా చేస్తున్నారు. దీనిని రిజిస్ట్రేషన్ కూడా చేస్తున్నారు. కీసర ప్రాంతంలో పాతికేళ్ల క్రితం భూములు, ఇళ్ల స్థలాల ధరలు చాలా తక్కువగా ఉండేవి. అప్పట్లో కీసర మారుమూల ప్రాంతంగా ఉండేది.
దీంతో ఇతర జిల్లాలకు, హైదరాబాదు నగరానికి చెందిన వారు ఇక్కడ స్థలాలపై పెట్టుబడి పెట్టారు. నగరం విస్తరించడంతో ప్రస్తుతం కీసర హైదరాబాద్ నగరంలో కలిసిపోయింది. ప్రస్తుతం మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉంది. ఈ ప్రాంతం దినదిన అభివృద్ధి చెందుతోంది. భూముల ధరలు పెరిగిపోయాయి. దీంతో పలువురి కన్ను వీటిపై పడింది. యజమాని చాలా రోజుల నుంచి ప్లాటు వద్దకు రావడంలేదని గురించి ఆ ప్లాటు పై పక్కా ప్రణాళికతో నకిలీ పత్రాలు సృష్టించి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వాటిని ఇతరులకు విక్రయిస్తున్నారు.
సబ్ రిజిస్ట్రార్ కుమ్మక్కు
నకిలీ పత్రాలు సృష్టించే వారు ఎక్కువగా రియల్టర్లు, డాక్యుమెంట్ రైటర్లు ఉన్నారు. వీరితో సబ్ రిజిస్టర్ రహమాన్ కుమ్మక్కయ్యారు. సబ్ రిజిస్ట్రార్ కుమ్మక్కై రిజిస్ట్రేషన్లు చేస్తుండడంతో ఎక్కువ సంఖ్యలో ఇలాంటి మోసాలు జరిగాయి. నిజాంపేట్ కు చెందిన రిటైర్డ్ ఉద్యోగి ఒకరు కీసర మండలం రాంపల్లి శివారులో 404,405 సర్వే నెంబర్లలో 300 గజాలు 1983లో కొనుగోలు చేశారు. ఈ స్థలం ఇతరుల పేరిట రిజిస్ట్రేషన్ అయిందని గుర్తించి ఇటీవల కీసర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారించగా అసలు యజమాని లేరని భావించి నకిలీ లింక్ డాక్యుమెంటు నంబర్లు సృష్టించి కబ్జా చేశారని తేలింది.
రైటర్ ఉదయ రెడ్డి, సబ్ రిజిస్టర్ కుమ్మక్కై తప్పుడు రిజిస్ట్రేషన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ప్లాటుకు నకిలీ యజమానిగా ధర్మారావు ను సృష్టించి, అతను ప్రదీప్ కుమార్ కు, ఇత ను ప్లాటును రెండుగా విభజించి ప్రభాకర్, నరేష్ కు విక్రయించారు. జి.వి.ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యజమాని గుబ్బల వెంకటేశ్వరరావుకు రిజిస్ట్రేషన్ చేశారు. ఆ తర్వాత ఇవి జంగాల శ్రీరామ్, విజయలక్ష్మి దంపతుల పేర్లపై రిజిస్ట్రేషన్ అయ్యాయి. నిందితులందరూ ఒక ముఠాగా ఏర్పడి మోసానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో శ్రీరామ్, గుబ్బల వెంకటేశ్వర రావు అలియాస్ జీవీర్, బందెల ప్రశాంత్ అలియాస్ బాబి, బందెల ప్రభాకర్, పొన్నబోయిన బాలకృష్ణ అలియాస్ బాలు, డాక్యుమెంట్ రైటర్ ఉదయ రెడ్డిని అరెస్టు చేశారు.
రూ. 100 కోట్ల పైన విలువచేసే ప్లాట్లకు నకిలీ పత్రాలు
నకిలీ పత్రాలు సృష్టించే ముఠాలు కీసర ప్రాంతంలో పదుల సంఖ్యలో ఉన్నాయి. ఇప్పటివరకు రూ. 100 కోట్ల పైన విలువ చేసే వాళ్లకు నకిలీ పత్రాలు సృష్టించారు. ఇంకా మరికొన్ని ప్లాట్లు కూడా డబులు రిజిస్ట్రేషన్ అయినట్లు తెలిసింది. యజమానులు వచ్చి చూసుకుంటే మరికొన్ని బయటపడే అవకాశం ఉంది. ఇటీవల కాలంలో ఈ ముఠాలకు చెందిన 84 మందిని పోలీసులు అరెస్టు చేశారు. మరికొందరు పరారీలో ఉన్నారు. సుదీర్ఘ కాలంగా ఇక్కడ పని చేసిన సబ్ రిజిస్టర్ రహిమాన్ హయాంలోని ఇలాంటి మోసాలు ఎక్కువగా జరిగాయి. ఇలాంటి మోసాల వల్ల అసలు యజమానులే కాకుండా కొనుగోలుదారులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. మోసాల ముఠాలను పూర్తిగా అరికట్టాలని బాధితులు, స్థానిక ప్రజలు కోరుతున్నారు.






