వైభవంగా అనంత సాహిత్య వేదిక వార్షికోత్సవం
- కవి రాసేటప్పుడు తల వంచుతడు.. రాశాక తలెత్తుకొని నిలబడతడు..
- ముఖ్యఅతిథిగా హాజరైన దేశపతి శ్రీనివాస్
- ప్రముఖ కవులు రచించిన పుస్తకాల ఆవిష్కరణ
చేవెళ్ళ/శంకర్ పల్లి మే 10(విజయక్రాంతి): అనంత సాహిత్య సాంస్కృతిక వేదిక మూడో వార్షికోత్సవం ఘనంగా జరిగింది. శంకర్ పల్లిలోని శ్రీ చైతన్య ఉన్నత పాఠశాలలో జరిగిన ఈ సమావేశానికి తుల్జారాం సింగ్ ఠాకూర్ సభధ్యక్షత వహించారు. ఈ ఉత్సవానికి ముఖ్య అతిథిగా దేశపతి శ్రీనివాస్ హాజరుకాగా విశిష్ఠ అతిథులుగా డా. తూర్పు మల్లారెడ్డి గౌరవ అతిథులుగా బి. పి. నర్సింహులు గుప్తా, అనంత అధ్యక్షులు టి. ఆశీర్వాదం, ప్రత్యేక అతిథులుగా కోటం చంద్రశేఖర్, అనంత ఉపాధ్యక్షులు మణిపూసల సృష్టికర్త వడిచర్ల సత్యం పాల్గొన్నారు.
అనంత సాహిత్య వేదిక ద్వారా ప్రతి సంవత్సరం ఇస్తున్న సుగుణ దోరవేటి తల్లి దండ్రుల పేరున సాహిత్య రంగంలో ఏర్పాటు చేసిన జీవన సాఫల్య పురస్కారాన్ని తొలి కాళోజీ పురస్కార గ్రహీత డా. అమ్మంగి వేణుగోపాల్, చింతామణి జానకీ రామారావు, జూలకంటి శ్వేతా, పాండురంగారెడ్డి మున్సిపల్ వైస్ ఛైర్మన్ పేరున కళారంగంలో ఏర్పాటు చేసిన పురస్కారాన్ని ప్రదానం చేశారు. కార్యక్రమంలో కడియాల మధుసూదనరావు, చిగురాల్ పల్లి ప్రసాద్ గారల సంపాదకత్వంలో వచ్చిన అనంత తృతీయ వార్షిక సంచిక, మణిపూసల కవితా ప్రక్రియలో రచించిన భావజలధి పుస్తకాన్ని, ఆకుల మల్లికార్జున, శివ కౌముది పుస్తకాన్ని, ప్రముఖ కవి రచయిత దోరవేటి రచించిన శ్రీరామ దర్శనం నాటకమును ఆవిష్కరించారు.
అనంత సాహిత్య వేదిక ప్రధాన కార్యదర్శి కమలేష్ సమన్వయంతో జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ... సాహిత్యం, కళలు స్వేచ్ఛగా వికసించాలన్న దేయంతో ఈ సంస్థ రూపొందడం చాలా అభినందనీయమని పేర్కొన్నారు. కాళోజీ నారాయణ, సురవరం ప్రతాపరెడ్డి వంటి కవులు చేసిన సాహితీ, సామాజిక సేవలను గుర్తు చేశారు. అనంతగిరి ఔషధగిరి అని కొనియాడారు. కవి రాసేటప్పుడు మాత్రమే తల వంచుతాడు. రాసిన తర్వాత తల ఎత్తుకొని నిలబడతడని చెప్పుకొచ్చాడు.
గతి తప్పుతున్నప్పుడు కవి దిక్సూచి లాంటి వాడని పేర్కొన్నాడు. భారతీయ జీవన విధానంలో, ఇతిహాసాలలో విశ్వ శ్రేయస్సును కోరుకునే విలువలు ఉంటాయి. మహమ్మద్ షరీఫ్, రవూపోద్దిన్, శివకుమార్, కడియాల మధుసూదనరావు, రామకృష్ణా రాజు, మావిశ్రీ మాణిక్యం, తాడూరు మోహనాచార్యులు, దుబ్బాకుల కృష్ణస్వామి, పాఠశాల ప్రిన్సిపాల్ రాజేష్ కుమార్, వెన్నెల సత్యం, చిగురాల్ పల్లి ప్రసాద్, తెలంగాణ రాష్ట్రం నలుమూల నుండి వచ్చిన వంద మందికి పైగా కవులు, పండితులు పాల్గొన్నారు.






