12 March, 2026 | 8:39 AM

లెబనాన్‌లో దాడులు మరింత ఉధృతం

12-03-2026 01:34 AM
  1. ఇప్పటి వరకు 570కి పెరిగిన మృతుల సంఖ్య
  2. 1,444 మందికి గాయాలు
  3. టెహ్రాన్‌పై ఇజ్రాయెల్ మళ్లీ దాడి

బీరుట్/టెహ్రాన్: యూఎస్ ఇరాన్ మధ్య యుద్ధం రోజురోజుకూ ఉధృతమవుతోంది. మశ్చిమాసియా దేశాల్లో దాడులు బుధవారం 12వ రోజుకు చేరుకున్నాయి. ఇజ్రాయెల్ వైమానిక దాడులు రెండు దక్షిణ లెబనాన్ పట్టణాలను తాకాయి. బుధవారం ఇజ్రాయెల్ వైమానిక దాడి హబౌష్, అల్-సవానాతో సహా దక్షిణ లెబనాన్‌లోని రెండు పట్టణాలను తాకిందని స్థానిక మీడియా వెల్లడించింది.

ఇజ్రాయెల్ ఇరాన్, లెబనాన్‌పై తాజాగా వైమానిక దాడులు ప్రారంభించింది. లెబనాన్‌లో ఇప్పటివరకు మృతుల సంఖ్య 570కి చేరింది. మార్చి 2న ప్రారంభమైన లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటివరకు దేశంలో 570 మంది మరణించారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించినట్లు అధికారిక వార్తసంస్థ పేర్కొంది. ఈ దాడుల్లో 1,444 మంది గాయపడ్డారు. మంగళవారం, ఇజ్రాయెల్ దాడుల్లో 84 మంది మృతి చెందారు.

131 మంది గాయపడ్డారు. తూర్పు, పశ్చిమ టెహ్రాన్‌లోని అనేక ప్రాంతాల్లో బుధవారం ఇజ్రాయెల్ కొత్త దాడులను ప్రారంభించిందని ఇరాన్ వార్తా సంస్థ పేర్కొంది. ఇజ్రాయెల్ ఇరాన్, లెబనాన్‌పై ఏకకాలంలో దాడులు చేసింది. నగరంలో ఎగిరే జెట్ల శబ్దం కూడా వినిపించిందని తెలిపింది. అయితే టెహ్రాన్‌లో మరణించిన ఇరాన్ సైనిక కమాండర్లకు నివాళులు అర్పించడానికి వేలాది మంది ఇరాన్ ప్రజలు టెహ్రాన్ వీధుల్లోకి తరలివచ్చారు.

అమెరికా- ఇజ్రాయెల్ సైనిక దాడుల్లో మరణించిన ఇరాన్ సైనిక కమాండర్లకు నివాళులు అర్పించడానికి వేలాది మంది ప్రజలు బయటికి వచ్చి గుమిగూడారని స్థానిక వార్త సంస్థ పేర్కొంది. ఇదిలా ఉండగా ఇరాన్ బాలికల పాఠశాలపై దాడిని ఇటాలియన్ ప్రధానమంత్రి జార్జియా మెలోని ఖండించారు. 160 మంది బాలికలను చంపిన మినాబ్ బాలికల పాఠశాలపై వైమానిక దాడిపై జార్జియా మెలోని స్పందించారు. ‘దక్షిణ ఇరాన్‌లో మినాబ్‌లోని పాఠశాలలో బాలికల ఊచకోతను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను’ అని మెలోని ఇటాలియన్ సెనేట్‌కు చెప్పారు. ఈ మేరకు అంతర్జాతీయ మీడియా పేర్కొంది.