18 May, 2026 | 3:42 PM

Breaking News

ఆశా వర్కర్లకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలి

18-05-2026 02:39 PM

- రూ. 18 వేల ఫిక్స్డ్ వేతనం చెల్లించాలి 

- సీఐటీయు ఆధ్వర్యంలో ఆశాల ధర్నా

మంచిర్యాల టౌన్, (విజయక్రాంతి) : ఆశా వర్కర్లకు ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, రూ. 18 వేల ఫిక్స్డ్ వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తూ సోమ వారం మంచిర్యాల శాసన సభ్యులు కొక్కిరాల ప్రేంసాగర్ రావు ఇంటి ముందు సీఐటీయు ఆధ్వర్యంలో ఆశాల కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ఆశా వర్కర్స్ యూనియన్  (సీఐటీయు) రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ధర్నా నిర్వహించి ఎమ్మెల్యే పీఎస్ఆర్ సతీమణి, మాజీ డీసీసీ అధ్యక్షురాలు సురేఖకు ఆశా వర్కర్ల సమస్యలపై వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్బంగా సీఐటీయు జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ మాట్లాడుతూ ఆశా వర్కర్లు ఇరవై సంవత్సరాల నుంచి పేద ప్రజలకు ఆరోగ్య సేవలందిస్తున్నారని, వీరంతా మహిళలు. బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారే అత్యధికులున్నారని, నేటికి వీరికి ఎలాంటి చట్టబద్ధ సౌకర్యాలు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. కనీసం గ్యారెంటీ ఫిక్సిడ్ వేతనం కూడా ఇప్పటివరకు ప్రభుత్వం నిర్ణయం చేయలేదు. ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారం కోసం 2023, సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 9 వరకు 15 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లు నిరవధిక సమ్మె చేస్తే గత ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చిందని, అనంతరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఆశా వర్కర్లకు వేతనాలు పెంచుతామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని ప్రకటించారని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు దాటిందని, అయినా నేటికి వేతనాలు పెంచలేదన్నారు

. రూ. 50 లక్షల ఇన్సూరెన్స్, రూ. 50 వేల మట్టి ఖర్చులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ తదితర హామీలు ఇచ్చినా, ఇంకా అమలు చేయటం లేదన్నారు. పీఆర్సి, ఎరియర్స్, లెప్రసీ, పల్స్ పోలియో, ఎలక్షన్ డ్యూటీ డబ్బులు సంవత్సరాల తరబడి పెండింగ్ లోనే ఉన్నాయన్నారు. ఇప్పటికైనా ఆశాల సమస్యలు పరిశీలించి, పరిష్కరించేందుకు ప్రభుత్వంతో చర్చించి ఆశా వర్కర్ల డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయు జిల్లా ఉపాధ్యక్షులు సంకె రవి, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ శోభ, ఆశా జిల్లా కమిటీ సభ్యురాలు సువర్ణ, సీఐటీయూ నాయకులు కస్తూరి చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.