రోడ్డు భద్రతపై ‘అరైవ్ అలైవ్’
సందేశంతో ప్రజలకు అవగాహన: డీజీపీ మహేష్ భగవత్
సంగారెడ్డి, జూన్ 10 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డి జిల్లా ఫసల్వాడి గ్రామంలో నిర్వహించిన గ్రామ సభకు తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (లా అండ్ ఆర్డర్) మహేష్ మురళీధర్ భగవత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా డీజీపీ మహేష్ మురళీధర్ భగవత్ మాట్లాడుతూ రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. చిన్న మొబైల్ ఫోన్ కొనుగోలు చేస్తేనే, స్క్రీన్ గార్డ్ వేయిస్తామని, మొబైల్ కంటే మన ప్రాణాలు, మన ప్రయాణం ఎంతో విలువైనవని గుర్తించాలని సూచించారు. ప్రాణరక్షణలో భాగమైన హెల్మెట్ను తప్పనిసరిగా కొనుగోలు చేసి వినియోగించాలని సూచించారు. కార్లలో ప్రయాణించేటప్పుడు డ్రైవర్ మాత్రమే కాకుండా ప్రయాణికులందరూ సీటు బెల్ట్ ధరించాలని అన్నారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం సేవించి వాహనం నడపరాదని, మద్యం సేవించినట్లయితే ప్రత్యామ్నాయ రవాణా సౌకర్యాలను వినియోగించాలని తెలిపారు. పండుగలకు అల్లుళ్లకు కొత్త బట్టలు బహుమతిగా ఇచ్చే సంప్రదాయం తెలంగాణ ప్రజలదని, తన తరఫున ఒక సూచనగా వారి ప్రాణరక్షణకు ఉపయోగపడే హెల్మెట్ను బహుమతిగా ఇస్తే మరింత మంచిదని అన్నారు. జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ, ‘ఆరైవ్ అలైవ్ ‘ అంటే మన ప్రయాణం సురక్షితంగా సాగి, గమ్యస్థానానికి క్షేమంగా చేరుకోవడం అని తెలిపారు.
కుటుంబ యజమానిని కోల్పోతే ఆ కుటుంబానికి కలిగే నష్టం తీర్చలేనిదని పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లా ప్రజలను రోడ్డు ప్రమాదాల పట్ల అప్రమత్తం చేసి, రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు డీజీపీ మహేష్ మురళీధర్ భగవత్, ఐపీఎస్ గారు ఫసల్వాడి గ్రామానికి రావడం ‘ఆరైవ్ అలైవ్ ‘ కార్యక్రమ ప్రాధాన్యతను తెలియజేస్తుందని అన్నారు.
ఈ సందర్భంగా ఫసల్వాడి గ్రామ సర్పంచ్ హరిప్రసాద్ మాట్లాడుతూ ఈ సభ వేదికగా నేటినుంచి హెల్మెట్, సీటు బెల్ట్ ధరించనిదే గ్రామంలోని ఎవరికీ అనుమతి లేదని తీర్మానం చేసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ ఉమాహారతి, అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, డీఎంహెచ్వో లలిత, ఆర్డీవో రాజేందర్, రవాణా శాఖ జాయింట్ కమిషనర్ వెంకటరమణ, డీఎస్పీ సత్యయ్య గౌడ్, ఎమ్మార్వో దశరథ్, జిల్లా పోలీసు అధికారులు, ఇతర శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, గ్రామస్థులు పాల్గొన్నారు.






