11 June, 2026 | 2:35 AM

పేలుతున్న తూటాలు

11-06-2026 01:54 AM
  1. అక్రమ ఆయుధాలకు సిటీ ఓ డెన్..?
  2. బీహార్, యూపీ నుంచి సరఫరా 
  3. రూ.20 నుంచి 30 వేలకు ఒక తుపాకీ 
  4. రౌడీ షీటర్లు, స్మగ్లర్లు, రియల్టర్ల వద్ద అక్రమ ఆయుధాలు 
  5. పోలీసుల నిఘా కరువు 
  6. ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రజలు 

మేడ్చల్, జూన్ 10 (విజయక్రాంతి): అక్రమ ఆయుధాల సరఫరా, వాడకం ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. తరచూ ఏదో ఒకచోట తుపాకీ పేలుతూనే ఉం ది. మేడ్చల్ జిల్లాతో పాటు నగరం అక్రమ ఆయుధాలకు అడ్డాగా మారింది. తాజాగా మేడ్చల్ జిల్లాలో మల్కాజిగిరిలోని మారుతినగర్‌లో ఒక వ్యక్తి భార్యను హత్య చేయడానికి తుపాకీ కొనుగోలు చేశాడు.

మొదటిసారి విఫలమై పోలీసులకు చిక్కి జైలుకెళ్ళిన, మళ్లీ జైలు నుంచి వచ్చిన తర్వాత బుధవారం తెల్లవారు జామున తుపాకీతో కాల్చి చంపాడు. గతంలోనూ తూటాల పేలిన సం దర్భాలు ఎన్నో ఉన్నాయి. అక్టోబర్‌లో మేడ్చల్ జిల్లా పో చారం పోలీస్ స్టేషన్ పరిధిలో గోవులు రవాణా చేస్తున్న వ్యక్తి గోరక్షకుడిపై కాల్పులు జరిపాడు. రౌడీ షీటర్ ఇబ్ర హీం దేశివాళీ తుపాకీతో రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు.

అంతకుముందు మలక్పేటలో మరో ఘటన జరి గింది. పాత కక్షలతో ప్రత్యర్థులు చందు నాయక్ ను తుపాకీతో కాల్పులు జరిపి హతమార్చారు. ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయి. ప్రతి రౌడీషీటర్, స్మగ్లర్, సెటిల్మెంట్లు చేసేవారు, చోటామోటా రాజకీయ నాయకులు అక్రమ ఆయుధాలు కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. 

బీహార్, యూపీ నుంచి అక్రమ రవాణా.. 

తుపాకులు బీహార్, యూపీ నుంచి అక్రమ రవాణా జరుగుతున్నట్లు తెలుస్తోంది. మల్కాజిగిరిలో భార్యను హత్య చేయడానికి అరుణ్ అనే వ్యక్తి తుపాకీని బీహార్ నుంచి తెప్పించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. పాతబస్తీకి చెందిన వారు మధ్యవర్తులుగా వ్యవహరించారు. బీహార్, యూపీలలో తుపాకుల త యారీ కుటీర పరిశ్రమగా ఉంది. అక్కడ తుపాకీ రూ. 20 నుంచి 30 వేలకు దొరుకుతుంది. కొంతమంది అక్క డ కొనుగోలు చేసి నగరానికి తీసుకువచ్చి అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు.

బీహా ర్, యూపీ నుంచి అనేకమంది ఉపాధి నిమిత్తం నగరానికి వలస వచ్చారు. దీంతో రాకపోకలు బాగా పెరిగాయి. వీరు వచ్చే సమయంలో తుపాకులు తీసుకు వస్తున్నట్లు తెలుస్తోంది. మరికొందరు అక్రమ ఆయుధాల సరఫరా వృత్తిగా పెట్టుకున్నారు. కంపెనీలలో పని చేసేవారు పని మానేసి తుపాకులు, గంజాయి రవాణా చేస్తున్నారు. పేరు మోసిన నేరగాడు బత్తుల ప్రభాకర్ నగరంలో ప్రిజం పబ్ వద్ద పోలీసులు పట్టుకోడానికి ప్రయ త్నించగా రెండు రౌండ్లు కాల్పులు జరిపి పరారయ్యాడు.

ఆ తర్వాత అతనిని పట్టుకొని విచారించగా బీహార్ నుంచి తుపాకి తెచ్చినట్లు తెలిపాడు. గత సంవత్సరం రాచకొండ పోలీసులు తుపాకులు విక్రయించడానికి ప్రయత్నించిన ఒకరిని పట్టుకున్నారు. యూపీ కి చెందిన హరే కృష్ణ యాదవ్ అనే వ్యక్తి గతంలో ఉపాధి నిమిత్తం హైదరాబాదు వచ్చి కొంతకాలం ఉన్నాడు.

ఆ తర్వాత స్వస్థలానికి వెళ్లిపోయాడు. బీహార్ సరిహద్దున ఉండడంవల్ల అక్రమ ఆయుధాలు తయారు చేస్తున్న వారితో పరిచయం ఏర్పడింది. అక్కడ తక్కువ ధరకు రెండు పిస్తళ్ళు, ఒక తపంచ కొన్ని బుల్లెట్లు కొనుగోలు చేసి హైదరాబాదులో విక్రయించడానికి ప్రయత్నించగా పోలీసులు పట్టుకున్నారు.

పోలీసుల నిఘా కరువు.. 

అక్రమ ఆయుధాల రవాణాపై పోలీసుల నిఘా లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. పోలీసుల నిఘా లేనందున నగరానికి యదేచ్చగా అక్రమ ఆయుధాలు సరఫరా అవుతున్నాయి. ప్రధానంగా బస్సులు, రైళ్లలో ఆయుధాలు తీసుకువస్తున్నారు. పోలీసులు బస్సులు, రైళ్లలో వస్తున్న వారిని సోదా చేయడం లేదు.

కార్డెన్ సర్చ్ తరహాలో నార్త్ ఇండియా నుంచి వచ్చిన కార్మికుల నివాస ప్రాంతాలను, రౌడీ షీటర్లు, స్మగ్లర్ లు, సెటిల్మెంట్లు చేసేవారి ఇళ్లను కూడా సోద చేస్తే అక్రమ ఆయుధాలు బయటపడే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. తరచూ కాలుపుల ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో తగిన చర్యలు తీసుకోవాలని, ఆయుధాల అక్రమ రవాణాను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.

భార్యను గన్‌తో కాల్చి చంపిన భర్త 

  • అనుమానమే పెనుభూతమైంది.. మల్కాజ్‌గిరిలో ఘటన

మేడ్చల్, జూన్ 10 (విజయక్రాంతి): మల్కాజ్గిరి పరిధిలోని మారుతి నగర్ లో భార్యను భర్త తుపాకితో కాల్చి చంపిన ఘటన కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం అరుణ్ కుమార్ అనే వ్యక్తి భార్య నిషా దేవిని మాట్లాడదామని పిలిచి తుపాకీతో కాల్పులు జరపగా అక్కడికక్కడ మరణించింది. అరుణ్ కుమార్ మొదటి భార్య అనారోగ్యం బారిన పడడంతో విడాకులు ఇచ్చి ఆమె సొంత చెల్లెలు నిషా దేవిని ప్రేమ వివాహం చేసుకున్నాడు.

నిషా దేవిని అనుమానిస్తూ నిత్యం వేధించడం ఇద్దరు మధ్య విభేదాలు ఏర్పడి దూరంగా ఉంటున్నారు. ఆమెను హత్య చేయడానికి మూడు నెలల క్రితం విఫల యత్నం చేశాడు. అప్పట్లోనే తుపాకీ కొనుగోలు చేశాడు. అంబర్పేటలో వాహనాల తనిఖీ సందర్భంగా తుపాకీతో దొరికిపోయాడు. దీంతో పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు పంపారు. తుపాకిని సీజ్ చేశారు. ఇటీవల జైలు నుంచి బయటకు వచ్చి మిత్రుడు తో కలిసి నిషా దేవి తో మాట్లాడడానికి పిలిచాడు.

వెంటనే ఆమెపై కాల్పులు జరపగా అక్కడికక్కడ మరణించింది. నిందితుడు తుపాకీని బీహార్లో కొనుగోలు చేసినట్లు తెలిసింది. పాత బస్తికి చెందినవారు మధ్యవర్తిత్వం వహించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని నిందితుడు తల్లి లక్ష్మీ నుంచి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.