ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా
నిర్మల్,(విజయక్రాంతి): జిల్లాలో ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లాలో ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం అంశంపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిర్దేశించిన లక్ష్యానికి మించి ఉద్యానవన పంటలను రైతులు సాగు చేసేలా అధికారులు ప్రోత్సహించాలని పేర్కొన్నారు.
మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను సాగు చేయడం వల్ల రైతులు లాభాలు పొందగలుగుతారని వివరించారు. ప్రస్తుతం విపణిలో ఉద్యానవన పంటలకు డిమాండ్ ఉన్నదని, దీనికి అనుగుణంగా రైతులు ఉద్యానవన పంటల సాగు వైపు మల్లాలని సూచించారు. తక్కువ శ్రమ, తక్కువ పెట్టుబడితో రైతులకు అధిక లాభాలు కలుగుతాయని పేర్కొన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు తదనుగుణంగా రైతులకు క్షేత్రస్థాయిలో ఉద్యానవన పంటల సాగుపై అవగాహన కల్పించాలని తెలిపారు.






