అవకతవకలు అదనపు అర్హతా..?!
- ‘చిరు’ద్యోగికి సొసైటీ కీలక బాధ్యతలు!
- అవినీతికి పాల్పడి ఉద్వాసనకు గురైనా అందలం
- 21 కోట్ల రూపాయల టర్నోవర్ కలిగిన దనసరి సొసైటీ నిర్వహణపై నీలి నీడలు
మహబూబాబాద్, జూలై 9 (విజయక్రాంతి): ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇరవై ఒక్క కోట్ల రూపాయల టర్నోవర్ తో మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలో మినీ బ్యాంకు తరహాలో రూపుదిద్దుకున్న దనసరి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) కు సరైన పర్యవేక్షణాధికారి నియామకానికి నోచుకోక సొసైటీ నిర్వహణపై నీలి నీడలు కమ్ముకున్నాయనే విమర్శలు వస్తున్నాయి. చాలా ఏళ్లుగా సొసైటీ సీఈఓ గా విధులు నిర్వహించిన కార్యదర్శి (సీఈవో) మల్లారెడ్డి గత మే 31న పదవీ విరమణ చేశారు.
అయితే ఆయన స్థానంలో సొసైటీకి సహకార శాఖలో రెగ్యులర్ కార్యదర్శిని నియమించాల్సి ఉండగా, కనీసం సమీప సొసైటీ కార్యదర్శి అదనపు బాధ్యతలు అప్పగించకుండా, అదే సొసైటీలో స్టాఫ్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తూ, అవకతవకలకు పాల్పడి ఒకసారి ఉద్యోగ ఉద్వాసనకు గురై మళ్లీ విధుల్లో చేరిన చిరుద్యోగికి ఏకంగా ఇంచార్జి సీఈవో గా బాధ్యతలు అప్పగించడం విమర్శలకు తావిస్తోంది. మహబూబాబాద్ జిల్లాలో విశిష్టమైన పేరు గడించిన ధనసరి సొసైటీ కేసముద్రం పట్టణంలో క్యాష్ కౌంటర్, పలు గ్రామాల్లో ఎరువుల విక్రయ కేంద్రాలు, ప్రజలకు ఇతర సేవలు జన ఔషధీ మెడికల్ షాపు, నిర్వహిస్తూ ప్రత్యేకతను చాటుకుంటోంది.
సొసైటీ చైర్మన్లుగా విధులు నిర్వహించిన ముదిగిరి సాంబయ్య, బండారు వెంకన్న, మర్రి రంగారావు (రెండు టర్ములు) నేతృత్వంలో సొసైటీ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతూ మినీ ‘ముల్కనూరు’ సొసైటీ గా గుర్తింపు పొందింది. కేసముద్రం మండల కేంద్రంలో వాణిజ్య బ్యాంకుల వలె ఈ సొసైటీ అనేక సంవత్సరాలుగా తన కార్యకలాపాలను నిర్వహిస్తోంది. సొసైటీ క్యాష్ కౌంటర్ లో అనేక సంఘాలు, వ్యక్తులు, సంస్థలు నగదు డిపాజిట్లు చేయడం, బంగారు నగలపై రుణాలు, వ్యక్తిగత రుణాలు, వాహనాల కొనుగోళ్లకు రుణాలు ఇస్తూ ఇప్పుడు 21 కోట్ల రూపాయలకు పైగా టర్నోవర్ సాధించింది.
అయితే అంతటి మంచి సొసైటీగా గుర్తింపు పొందిన ధనసరి సొసైటీ నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యతలను ఇప్పుడు అనువైన వ్యక్తికి ఇవ్వలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం సొసైటీ ఇన్చార్జి సీఈవోగా నియమితుడైన చిరుద్యోగి స్టాఫ్ అసిస్టెంట్ ఆకుల రాంబాబు 2022లో ధాన్యం కొనుగోలు కేంద్రం ఇన్చార్జిగా వ్యవహరించిన సమయంలో అవకతవకులకు పాల్పడి, ఉద్యోగం నుండి ఉద్వాసనకు గురయ్యాడు. అప్పటి సహకార శాఖ అధికారి విచారణ జరిపి అతని విధుల నుంచి తొలగించాలని దనసరి సొసైటీ పాలకమండలికి సిఫారసు చేయగా, ఆ సిఫారసు ఆధారంగా రాంబాబును ధనసరి సొసైటీ పాలకమండలి చైర్మన్, ప్రస్తుత చైర్మన్ మర్రి రంగారావు నేతృత్వంలో అతన్ని ఉద్యోగం నుండి తొలగించారు.
ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో మళ్లీ అతన్ని కొంతకాలం తర్వాత విధుల్లోకి తీసుకున్నారు. తీరా ఇప్పుడు అదే రాంబాబుకు ఏకంగా సొసైటీ ఇంచార్జ్ సీఈవో గా బాధ్యతలు అప్పగించడం, అతని విధుల్లో నుంచి తొలగించిన పాలకమండలి, ఇప్పుడు అతనికి క్లీన్ చీట్ ఇవ్వడం, స్టాఫ్ అసిస్టెంట్ స్థాయి చిరుద్యోగిని సీఈవోగా అతన్ని నియమించాలని సిఫారసు చేయడం వెనక ఆంతర్యం ఏమిటన్నది ప్రశ్నార్ధకంగా మారింది. జిల్లా సహకార శాఖ అధికారులు, జిల్లాలో ప్రతిష్టాత్మకమైన సొసైటీ నిర్వహణ బాధ్యతలను అప్పగించే సమయంలో ముందు వెనక ఆలోచించకుండా, గతంలో అవకతవకలకు పాల్పడి ఉద్యోగం నుండి ఉద్వాసనకు గురైన చిరుద్యోగి కి సీఈవోగా బాధ్యతలు అప్పగించడం అనేక అనుమానాలకు తావిస్తోంది.
21 కోట్ల రూపాయల టర్నోవర్ తో పాటు ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల నిర్వహణ, పలు గ్రామాల్లో ఎరువుల విక్రయ కేంద్రాలు, పట్టణంలో జన ఔషధీ మెడికల్ షాపు నిర్వహణ, క్యాష్ కౌంటర్ లో నిత్యం లక్షల రూపాయల డిపాజిట్లు, విత్ డ్రా, బంగారు నగలపై రుణాలు తదితర అంశాల నిర్వహణలో ఏదైనా జరగకూడనిది జరిగితే బాధ్యత ఎవరిదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జిల్లా అధికారులు స్పందించి వెంటనే దనసరి సొసైటీకి రెగ్యులర్ కార్యదర్శిని నియమించాలని, లేని పక్షంలో రెగ్యులర్ కార్యదర్శిని నియమించేంత వరకు మరో రెగ్యులర్ సొసైటీ కార్యదర్శికి ఇంచార్జీ బాధ్యతలు అప్పగించాలని, చిరుద్యోగికి ఇచ్చిన ఇంచార్జీ సీఈవో బాధ్యతలను తక్షణం తప్పించాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అతని నియామకం తాత్కాలికమే!
సొసైటీ సీఈఓ మల్లారెడ్డి పదవి విరమణతో సొసైటీలో పని చేస్తున్న స్టాఫ్ అసిస్టెంట్ రాంబాబుకు తప్పని సరి పరిస్థితిలో సొసైటీ పాలకమండలి తీర్మానం మేరకు ఇన్చార్జి సీ ఈ వో గా బాధ్యతలు అప్పగించడం జరిగింది. ఇన్చార్జిగా అతని నియామకం తాత్కాలికమే. ఏలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా గట్టి చర్యలు తీసుకున్నాం. కొద్దిరోజుల్లో రెగ్యులర్ సీఈఓ నియామకం కోసం చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
- మర్రి రంగారావు, సొసైటీ చైర్మన్






