అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద సమగ్ర అభివృద్ధి ప్రతిపాదనలకు ఆమోదం
కొత్తపల్లి, మే 7 (విజయక్రాంతి): కరీంనగర్ నగరాన్ని భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా అత్యాధునిక నగరంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద రూ.1,150 కోట్ల విలువైన సమగ్ర అభివృద్ధి ప్రతిపాదనలను సిద్ధం చేసినట్లు నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ తెలిపారు.
ఈ ప్రతిపాదనలపై చర్చించి ప్రభుత్వానికి పంపించేందుకు నగరపాలక సంస్థ కార్యాలయంలో అత్యవసర సర్వసభ్య సమావేశం నిర్వహించగా, సభలో సభ్యులందరూ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ కరీంనగర్ నగరం వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో భవిష్యత్ తరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పించడం అత్యవసరం. ట్రాఫిక్ సమస్యలు, డ్రైనేజీ, తాగునీరు, రోడ్లు, సుందరీకరణ, స్మార్ట్ సిటీ తరహా అభివృద్ధి వంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని ఈ ప్రతిపాదనలు రూపొందించాం.
కరీంనగర్ను తెలంగాణలోనే ఆదర్శ నగరంగా నిలపడం మా లక్ష్యం అని తెలిపారు.ప్రధానంగా నగరంలోని ప్రధాన రహదారుల విస్తరణ మరియు ఆధునీకరణ, ఆధునిక డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం, ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి జంక్షన్ అభివృద్ధి పనులు, అండర్గ్రౌండ్ డ్రైనేజ్, స్టార్మ్ వాటర్ లైన్లు, స్మార్ట్ వీధి దీపాలు, గ్రీన్ కారిడార్లు, చెరువుల అభివృద్ధి, నగర సుందరీకరణ, పార్కులు, వాకింగ్ ట్రాక్లు, ప్రజా వినియోగ వసతులు, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా సమగ్ర పట్టణ ప్రణాళిక చేయడం జరిగిందని, పార్టీలకతీతంగా నగర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్రతిపాదనలకు మద్దతు తెలిపిన కార్పొరేటర్లు, కో-ఆప్షన్ సభ్యులు మరియు అధికారులకు మేయర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా పట్టణాభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత లభిస్తోందని,కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సహకారంతో ఆ అవకాశాలను కరీంనగర్కు తీసుకురావడమే తమ లక్ష్యమని మేయర్ పేర్కొన్నారు. త్వరలోనే అనుమతులు ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించి, అనుమతులు పొందిన వెంటనే యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి పనులు ప్రారంభిస్తామని మేయర్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్, కార్పొరేటర్లు, కో-ఆప్షన్ సభ్యులు, ఇంజనీరింగ్ మరియు టౌన్ ప్లానింగ్ అధికారులు పాల్గొన్నారు.






