29 May, 2026 | 3:18 AM

సబ్‌స్టేషన్ కోసం ఏళ్లుగా ఎదురు చూపులు

29-05-2026 01:27 AM

లో వోల్టేజీతో రైతుల ఇబ్బందులు

వెల్దండ, మే 28: మండల పరిధిలోని పోతేపల్లి గ్రామంలో నిర్మాణంలో ఉన్న విద్యుత్ సబ్ స్టేషన్ పనులు ఏళ్లుగా పూర్తి కాకపోవడంతో రైతులు, తండా వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లో వోల్టేజి సమస్యతో పాటు తరచూ విద్యుత్ అంతరాయం ఏర్పడుతూ మోటార్లు కాలిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పోతేపల్లి పరిసర ప్రాంతాలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించేందుకు ప్రభుత్వం రూ.1.20 కోట్లు మంజూరు చేసి 2018లో విద్యుత్ ఉపకేంద్రం నిర్మాణ పనులను ప్రారంభించింది. అయితే అధికారుల నిర్లక్ష్యం, పాలకుల అలసత్వం కారణంగా పనులు నత్తనడకన సాగుతూ ఇప్పటికీ పూర్తి కాలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

సబ్ స్టేషన్ పూర్తయితే పోతేపల్లి, లింగారెడ్డిపల్లి, దొడ్లపల్లి, మహాత్మా గాంధీ కాలనీ తండా, అల్లం తోటబాయి తండా, సిలోని బండ తండా, పోచమ్మ తండా, నెమలిగుండు తండా తదితర గ్రామాలకు విద్యుత్ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుందని రైతులు చెబుతున్నారు. డి-82 కాలువ పరిధిలో వ్యవసాయ మోటార్లు అధికంగా ఉండటంతో తక్కువ వోల్టేజ్ కారణంగా పంటల సాగుపై ప్రభావం పడుతోందని పేర్కొన్నారు. ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకుని సబ్ స్టేషన్ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి రైతులకు నిరంతర, నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.