1 August, 2026 | 12:48 AM

తప్పుడు కేసులు మా పోరాటాన్ని ఆపలేవు

01-08-2026 12:00 AM
  1. రాజకీయ కక్షతోనే మాపై అక్రమ కేసులు
  2. చివరకు సత్యమే గెలుస్తుంది
  3. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
  4. ‘ఫార్ములా- ఈ-కార్’ కేసులో నాంపల్లి కోర్టుకు హాజరు
  5. తదుపరి విచారణ ఈ నెల 25కు వాయిదా

హైదరాబాద్, జూలై 31 (విజయక్రాంతి) : ప్రజల తరఫున తాము చేసే పోరాటాన్ని తప్పుడు కేసులు ఆపలేవని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. రాజకీయ కుట్రతోనే తమపై ఫార్ములా- ఈ-కార్ కేసు బనాయించారని ఆరోపించారు. ఫార్ములా ఈ-కార్ రేస్ కేసు విచారణలో భాగంగా శుక్రవారం నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక కోర్టుకు కేటీఆర్ హాజరయ్యారు. కోర్టు ఆదేశాల మేరకు కేటీఆర్ రూ.1 లక్ష వ్యక్తిగత పూచీకత్తు సమర్పించగా, ఇద్దరు వ్యక్తులతో షూరిటీ సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది.

కేటీఆర్‌తో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీ.ఎల్.ఎన్. రెడ్డి కూడా కోర్టులో పూచీకత్తులు సమర్పించారు. అనంతరం కేసు తదుపరి విచారణను ఈనెల 25వ తేదీకి వాయిదా వేసింది. కోర్టుకు హాజరయ్యే ముందు కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.

తమపై అక్రమంగా కేసులు బనాయించినా అంతిమంగా సత్యమే గెలుస్తుందని పేర్కొన్నారు. ప్రజల కోసం తమ పోరాటం నిరంతరం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ లీగల్ టీం స్పందిస్తూ.. శుక్రవారం విచారణలో ఛార్జ్ షీట్‌తోపాటు ఇతర కేసు పత్రాలను మాత్రమే కోర్టు అందజేసిందని, కేసు మెరిట్స్‌పై ఎలాంటి విచారణ జరగలేదని వెల్లడించింది. 

పరిగణనలోకి ఛార్జ్‌షీట్

ఫార్ములా-కార్ రేసు నిర్వహణలో నిబంధనలకు విరుద్ధంగా యూకేకు చెందిన ఫార్ములా- ఈ ఆర్గనైజేషన్(ఎఫ్‌ఈవో)కు రూ.55 కోట్లు మళ్లించారనే ఆరోపణలపై ఏసీబీ 2024 డిసెంబర్‌లో కేసు నమోదు చేసింది. దాదాపు 15 నెలల దర్యాప్తు అనంతరం ఈ ఏడాది మార్చిలో 77 పేజీల ఛార్జిషీట్‌ను కోర్టులో దాఖలు చేసింది. ఇందులో 14 మంది సాక్షులను పేర్కొంటూ కేటీఆర్‌తో పాటు అరవింద్‌కుమార్, బీ.ఎల్.ఎన్. రెడ్డి, ఎఫ్‌ఈఓ ప్రతినిధి ఆల్బెర్టో లాంగో, ఏస్ నెక్ట్స్ జెన్ డైరెక్టర్ కిరణ్‌రావుపై అభియోగాలు మోపింది.

రేసు స్పాన్సర్‌గా ఉన్న ’ఏస్ నెక్ట్స్ జెన్’ సంస్థ తప్పుకోవడంతో, నిబంధనలను అతిక్రమించి ఆ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వమే తీసుకునేలా కేటీఆర్ ఆదేశించారని ఏసీబీ తన ఛార్జిషీట్‌లో ఆరోపించింది. అయితే, హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి క్రీడా వేదికగా నిలబెట్టాలనే ఉద్దేశంతో అప్పటి ప్రభుత్వం సమష్టిగా తీసుకున్న విధానపరమైన నిర్ణయమే తప్ప, అది తన వ్యక్తిగత నిర్ణయం కాదని కేటీఆర్ ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశారు.

అధికారులు, నిపుణుల సలహాలతో తీసుకున్న అభివృద్ధి నిర్ణయాలను ఇప్పుడు నేరాలుగా చిత్రీకరిస్తున్నారని ఆయన వాదిస్తున్నారు. కాగా శుక్రవారం ఉదయం కోకాపేటలోని తన నివాసం నుంచి నేరుగా నాంపల్లి కోర్టుకు చేరుకున్న కేటీఆర్‌కు పార్టీ ప్రజాప్రతినిధులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, న్యాయవాదులు పెద్ద సంఖ్యలో సంఘీభావం తెలిపారు. దీంతో నాంపల్లి కోర్టు పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.