1 August, 2026 | 12:47 AM

రంగనాథ్‌ను త్వరగా బదిలీ చేయండి

01-08-2026 12:00 AM
  1. హైడ్రా కమిషనర్‌పై హైకోర్టు సీరియస్ 
  2. చట్టపరమైన పాలనే కొనసాగాలి 
  3. కోర్టు ధిక్కరణ నేపథ్యంలో ఆయనను 
  4. వీలైనంత త్వరగా బదిలీ చేయాలి
  5. ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సీఎస్ సంజయ్‌జాజుకు 
  6. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీ 
  7. శాంతా శ్రీరాం కేసులో తీర్పు

హైదరాబాద్, జూలై 31(విజయక్రాంతి): తెలంగాణలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన హైడ్రా వ్యవహారంలో రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం అత్యంత కీలకమైన ఉత్తర్వులను వెలువరించింది. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌ను తక్షణమే బదిలీ చేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజుకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. వివాద భూమిలో హైడ్రా చర్యలు చట్టవిరుద్ధమని స్పష్టం చేసింది. చట్టపరమైన పాలనే కొనసాగాలని, వ్యక్తుల పాలన కాదని వెల్లడించింది.

వ్యక్తుల ఆధిపత్యం కొనసాగితే ప్రజాస్వామ్యానికి మరణశాసనం అవుతుందని తేల్చిచెప్పింది. హైడ్రాపై తీర్పు కాపీలో హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. రంగనాథ్‌ను వీలైనంత త్వరగా బదిలీచేయాలని ఆదేశించింది. లోతుకుంటలోని శాంతా శ్రీరాం కన్‌‌‌రరస్టక్షన్ కంపెనీకి చెందిన 40 ఎకరాల భూముల వివాదంలో కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారనే ఆరోపణలపై హైకోర్టు విచారించింది. ఈ కేసులో హైడ్రా కమిషనర్ చట్ట నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

ప్రజాస్వామ్యంలో చట్టపాలన మాత్రమే అత్యున్నతమైనదని స్పష్టం చేసింది. లోతుకుంట భూముల వ్యవహారంలో ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన పూర్వ ఉత్తర్వులను హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టంగా ఉల్లంఘించారని, ముమ్మాటికీ తప్పు చేశారని హైకోర్టు తన తీర్పులో పేర్కొంది. కోర్టు ఆదేశాలను గతంలో ఇచ్చిన అండర్‌టేకింగ్‌ను కమిషనర్ ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారని స్పష్టం చేసింది.

శాంతాశ్రీరామ్ కన్స్ట్రక్షన్ కంపెనీ కేసులో ఎలాంటి నోటీసు లూ ఇవ్వకుండా ప్రైవేట్ భూమిలోకి ప్రవేశించి, యంత్రాలతో కూల్చివేతలు చేపట్టడం చట్టవిరుద్ధమని తేల్చిచెప్పింది. కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసిన తర్వాత ఆలస్యంగా చెప్పిన క్షమాపణను నిజాయితీ లేనిదిగా భావించి, తిరస్కరించింది. ఇది కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని, న్యాయవ్యవస్థ గౌరవాన్ని, చట్టబద్ధతను దెబ్బతీసే చర్య అని తీవ్రంగా వ్యాఖ్యానించింది.

ఈ సందర్భంగా గతంలో సుప్రీంకోర్టు ఇచ్చించిన ‘టాటా మోహన్ రావు’ కేసు ఉత్తర్వులను హైకోర్టు ప్రస్తావించింది. శిక్షించడంలో కాకుండా క్షమించడంలోనే చట్టం ఔన్నత్యం ఉంది‘ అని పేర్కొంటూనే, పాలనలో చట్టం పరిధి దాటి వెళ్లకూడదని హెచ్చరించింది. ఈ కోర్టు ధిక్కరణ చర్యలను తీవ్రంగా పరిగణించిన హైకోర్టు, కమిషనర్ రంగనాథ్‌ను వెంటనే ఆ పదవి నుంచి తప్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఆయన స్థానంలో మరొక అధికారిని వీలైనంత త్వరగా నియమించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సంజయ్ జాజుకు ఆదేశాలు జారీ చేసింది. సమాజంలో కేవలం చట్టపాలన మాత్రమే కొనసాగాలని, ఏ ఒక్క వ్యక్తి ఆధిపత్యం పెరిగినా అది ప్రజాస్వామ్యానికే మరణశాసనం అవుతుందని హెచ్చరించింది.

ఈ కేసే అందుకు ప్రత్యక్ష ఉదాహరణ అని న్యాయస్థానం తన తీర్పులో అత్యంత ఘాటుగా అభిప్రాయపడింది. చట్ట నియమాలను పక్కనబెట్టి వ్యవహరించే వైఖరి ప్రజాస్వామ్య వ్యవస్థకే ప్రమాదకరమని స్పష్టం చేస్తూ, రంగనాథ్ స్థానంలో వేరే అధికారిని బాధ్యతల్లోకి తీసుకోవాలని సీఎస్ ను కోరింది.  

ఆ వార్తలు నమ్మొద్దు: రంగనాథ్

తనకు నెల రోజుల జైలుశిక్ష పడిందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. తనపై పూర్తిగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అందులో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు. తనకు తెలంగాణ హైకోర్టు నెల రోజుల శిక్ష విధించిందంటూ ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్న వార్తలను ఆయన ఖండించారు. తాను ఊహించినట్లుగానే కొందరు కావాలని సామాజిక మాధ్యమాలలో తప్పుడు వార్తలను వ్యాప్తి చేస్తున్నారని పేర్కొన్నారు.