1 August, 2026 | 12:45 AM

కసిరెడ్డికి అమాత్య యోగం దక్కేనా?

01-08-2026 12:04 AM
  1. కేఎల్‌ఐ ఎత్తిపోతలలో కీలకపాత్ర 
  2.   12 ఏళ్ల శ్రమకు గుర్తింపు దక్కేనా
  3. సీఎంపై పెరుగుతున్న ఒత్తిడి 
  4. విద్యావేత్త, అభివృద్ధి ప్రదాతగా గుడ్ నేమ్ 

రంగారెడ్డి, జులై 31(విజయక్రాంతి): పాలమూరు రాజకీయ యవనికపై తనదైన ముద్ర వేసిన కల్వకుర్తి నియోజకవర్గానికి ‘అమాత్య’ యోగం ఎప్పుడు దక్కుతుందా అ ని స్థానిక ప్రజలు, కాంగ్రెస్ శ్రేణులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నాయి. మాజీ మంత్రి చిత్తరంజాన్ దాస్ తర్వాత దశాబ్దాలు గడిచి నా ఈ ప్రాంతం నుంచి మరొకరు కేబినెట్ మంత్రిగా బాధ్యతలు చేపట్టలేదు. తాజాగా కాంగ్రెస్ అధిష్టానం మంత్రివర్గ విస్తరణపై క సరత్తు వేగవంతం చేయడంతో కల్వకుర్తి ని యోజకవర్గంలో రాజకీయ వేడి పెరిగింది.

విస్తరణ సమీపిస్తుండటంతో జోరందుకున్న చర్చ

ఇటీవల ప్రభుత్వం ఎమ్మెల్యే యెన్నాం శ్రీనివాస్ రెడ్డి, వేముల వీరేశంలకు ప్రభుత్వ విప్ తో పాటు కేబినెట్ హోదా కల్పిస్తూ  నిర్ణయంతీసుకోవడంతో కల్వకుర్తిలోనూ ఆశలు చిగురించాయి. ప్రస్తుతం ఖాళీగా ఉన్న కేబినెట్ బెర్తుల భర్తీతో పాటు, పర్ఫార్మెన్స్ ఆధారంగా కొందరు మంత్రులకు ఉద్వాసన పలికి కొత్త వారికి అవకాశం కల్పిస్తారనే ప్రచారం కాంగ్రెస్ వర్గాల్లో తీవ్రంగా సాగుతోంది.

ఈ క్రమంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఆదరణ కలిగిన నాయకుడిగా, నియోజకవర్గ ప్రగతికి పాటుపడుతున్న ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డికి కేబినెట్లో ప్రాధాన్యత ఇవ్వాలనే డిమాండ్ క్షేత్రస్థాయి నుంచి బలంగా వినిపిస్తోంది. ఒకవేళ కేబినెట్లో కొత్త ముఖాలకు చోటు కల్పించాలని పార్టీ అధిష్టానం భావిస్తే, ఉమ్మడి పాలమూరు నుంచి రేసులో కసిరెడ్డి పేరు ముందు వరుసలో ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

12 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం.. ప్రజల్లో చెరగని ముద్ర

గత 12 ఏళ్లుగా కల్వకుర్తి నియోజకవర్గంతో కసిరెడ్డి నారాయణరెడ్డి బంధం మరింత గట్టిపడింది. కేవలం ప్రజా ప్రతినిధిగానే కాకుండా ప్రతి ఇంట్లో ఒకడిగా మారి ప్రజల కష్టసుఖాల్లో భాగస్వామియ్యారు. కష్టకాలంలో అండగా ఉంటూ విద్యావేత్తగా వేలాది మంది విద్యార్థులకు ఉజ్జ్వల భవిష్యత్తును అందించిన ఆయన, రాజకీయాల్లోకి వచ్చాక నియోజకవర్గంలో ఏ మూల ఏ చిన్న సమస్య వచ్చినా ప్రత్యక్షంగా వాలిపోయేవారు.

ఎమ్మెల్సీ నుంచి ఎమ్మెల్యే వరకు:

2015లో ఎమ్మెల్సీగా గెలిచిన నాటి నుంచి 2023లో ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టినంత వరకు... కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కాలవల నిర్మాణం, సాగునీటి విడుదల, గ్రామీణ రోడ్ల పునర్నిర్మాణంపై నిరంతరం పోరాడారు. తన సొంత నిధులతో పాటు సిఎమ్‌ఎల్సి నిధులను సైతం నియోజకవర్గ రూపురేఖలు మార్చడానికే వెచ్చించారు. ఇప్పటి వరకు రూ. 2వేల కోట్ల నిధులు  నియోజకవర్గం లో అభివృద్ధికి పనులకు మంజూరు చేయడంలో ఆయన క్రియాశీలక పాత్ర పోషించారు.

సామాజిక సమీకరణలు ఆటంకమా?

కేబినెట్ విస్తరణలో సామాజిక సమీకరణాలు కీలక పాత్ర పోషిస్తాయనే వార్తలు వినిపిస్తున్నప్పటికీ, పార్టీ కోసం మరియు ప్రాంత అభివృద్ధి కోసం 12 ఏళ్లుగా శ్రమిస్తున్న కసిరెడ్డి సేవలను అధిష్టానం గుర్తించాలని స్థానిక నాయకులు విజ్ఞప్తి చేస్తున్నారు. కేవలం సామాజిక అంశాలకే ప్రాధాన్యంఇవ్వకుండా, నియోజకవర్గంలో ఆయనకున్న పట్టు, సీనియారిటీ, పనితీరును ప్రామాణికంగా తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

మంత్రి పదవే.. కల్వకుర్తి అభివృద్ధికి సంపూర్ణ మార్గం!

దశాబ్దాలుగావెనుకబాటుతనంతో ఉన్న కల్వకుర్తి ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది రాష్ట్రస్థాయిలో ప్రాముఖ్యత సంతరించుకోవాలంటే కసిరెడ్డికి కేబినెట్ హోదా దక్కడమే సరైన మార్గమని స్థానికులు భావిస్తున్నారు.కల్వకుర్తిలోనే మెరుగైన విద్యా వసతులు, ఆధునిక సూపర్ స్పెషాలిటీ వైద్య సదుపాయాలు అందుబాటులోకి రావడానికి మంత్రి ప్రాతినిధ్యం అవసరం.

స్థానిక ఉపాధి అవకాశాల కల్పన నిరుద్యోగ యువత వలసలు పోకుండా స్థానికంగానే పరిశ్రమల స్థాపన, ఐటీ రంగ విస్తరణ ద్వారా ఉపాధి అవకాశాలు పెంచవచ్చు.  ప్రతి ఎకరానికి సాగునీరు అందించి సస్యశ్యామలం చేయాలన్నా, పెండింగ్ ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలన్నా మంత్రివర్గంలో కల్వకుర్తికి చోటు దక్కాల్సిందే అని నియోజకవర్గ ప్రజల డిమాండ్.

సీఎం ‘వరాల జల్లు’ కురిపించేనా?

కల్వకుర్తి ప్రాంత సమస్యలు, ఇక్కడి ప్రజల దశాబ్దాల ఆకాంక్షలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సుపరిచితమే. కసిరెడ్డికి ఉన్న ప్రజాదరణ, ఆయన గత 12 ఏళ్లుగా క్షేత్రస్థాయిలో చేసిన కృషిని పరిగణనలోకి తీసుకుని రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపుతారని కాంగ్రెస్ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. కసిరెడ్డికి మంత్రివర్గంలో చోటు కల్పిస్తే కల్వకుర్తిని రాష్ట్రంలోనే రోల్ మోడల్గా తీర్చిదిద్దే అవకాశం ఉంటుంది. మరి అధిష్టానం సామాజిక సమీకరణాల దాటి 12 ఏళ్ల కసిరెడ్డి శ్రమకు, కల్వకుర్తి ప్రజల దశాబ్దాల ఆకాంక్షకు తగిన గుర్తింపు నిస్తుందో లేదో తెలియాలంటే కాంగ్రెస్ నిర్ణయం వరకు వేచి చూడాల్సిందే!