1 August, 2026 | 12:47 AM

ఒక జిల్లా.. రెండు రైస్‌మిల్ అసోసియేషన్లు!

01-08-2026 12:00 AM
  1. వారం రోజుల వ్యవధిలో మరో కమిటీ ఏర్పాటు.. 
  2. ఐదు మండలాలతో కొత్త అసోసియేషన్
  3. రెండు వర్గాలుగా చీలిన మిల్లర్లు.. 
  4. పౌర సరఫరాల శాఖ గుర్తింపు ఎవరికి? 

వనపర్తి, జూలై 31 (విజయక్రాంతి): వనపర్తి జిల్లా రైస్ మిల్లర్లలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వారం రోజుల వ్యవధిలోనే మరో జిల్లా రైస్ మిల్ అసోసియేషన్ ఏర్పాటు కావడం జిల్లాలో తీవ్ర చర్చకు దారితీసింది. ఇప్పటికే ఒక అసోసియేషన్ ఉండగానే తాజాగా ఐదు మండలాలకు చెందిన మిల్లర్లతో మరో కమిటీ ఏర్పడటంతో అసలు అధికారిక ప్రాతినిధ్యం ఎవరిది అన్న ప్రశ్న ముందుకొచ్చింది.

రైస్ మిల్లర్ల సమస్యల పరిష్కారం, సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) విధానాలు, ధాన్యం మిల్లింగ్, ప్రభుత్వంతో చర్చలు వంటి కీలక అంశాల్లో ఒకే వేదిక ఉండాల్సిన సమయంలో రెండు అసోసియేషన్లు ఏర్పడటం మిల్లర్లలో అయోమయాన్ని పెంచుతోంది. వారం రోజుల్లోనే మరో కమిటీ ఏర్పాటు... ఇటీవల జిల్లా స్థాయిలో ఒక అసోసియేషన్ కార్యవర్గం ప్రకటించగా, వారం రోజుల వ్యవధిలోనే కొత్తకోటలో మరో సమావేశం నిర్వహించి ఐదు మండలాలకు చెందిన సభ్యులతో మరో కమిటీని ఎన్నుకోవడం రాజకీయ, వ్యాపార వర్గాల్లో చర్చనీయాంశమైంది.

రెండు కమిటీలు కూడా తామే జిల్లా రైస్ మిల్లర్లకు ప్రాతినిధ్యం వహిస్తున్నామని చెబుతుండటంతో గందరగోళం నెలకొంది. ఎవరిది అసలు ప్రాతినిధ్యం? జిల్లాలోని అన్ని మండలాల మిల్లర్లకు ఏ కమిటీ ప్రాతినిధ్యం వహిస్తోంది? ఏ కమిటీ సభ్యత్వం ఎక్కువ? చట్టబద్ధంగా నమోదు చేయబడిన అసోసియేషన్ ఏది? ఈ ప్రశ్నలకు ఇప్పటివరకు స్పష్టమైన సమాధానం కనిపించడం లేదు.

పౌర సరఫరాల శాఖ ఎవరితో సమావేశాలు నిర్వహిస్తుంది? ప్రభుత్వ ధాన్యం సేకరణ, సీఎంఆర్ లక్ష్యాలు, మిల్లుల కేటాయింపులు, సమస్యల పరిష్కారం వంటి అంశాల్లో పౌర సరఫరాల శాఖ నేరుగా రైస్ మిల్లర్లతో సమన్వయం చేస్తుంది. అలాంటి పరిస్థితిలో రెండు అసోసియేషన్లు ఉంటే అధికారులు ఎవరిని అధికారికంగా గుర్తిస్తారు? సమావేశాలకు ఏ కమిటీని ఆహ్వానిస్తారు? ప్రభుత్వ నిర్ణయాలపై ఎవరి సంతకాన్ని పరిగణనలోకి తీసుకుంటారు? అనే ప్రశ్నలు ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్నాయి.

చీలిక వెనుక కారణాలేమిటి? ఈ విభజన కేవలం నాయకత్వ పోరా? లేక విధానపరమైన విభేదాలా? వ్యక్తిగత ఆధిపత్యమే కారణమా? లేక రాబోయే ప్రభుత్వ వ్యవహారాల్లో పట్టుకోసం జరుగుతున్న పోటీనా? అనే చర్చ కూడా మిల్లర్లలో సాగుతోంది. నష్టపోయేది సామాన్య మిల్లరేనా? రెండు వర్గాల మధ్య పోటీ కొనసాగితే ప్రభుత్వ స్థాయిలో మిల్లర్ల సమస్యలను బలంగా వినిపించే అవకాశం తగ్గే ప్రమాదం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఒకే స్వరంతో ప్రభుత్వాన్ని సంప్రదించాల్సిన సమయంలో రెండు గొంతులు వినిపిస్తే నిర్ణయాలపై ప్రభావం పడే అవకాశాన్ని కొట్టిపారేయలేమని అంటున్నారు. సమాధానం లేని ప్రశ్నలుగా పరిస్థితి ....జిల్లాలో అధికారికంగా గుర్తింపు పొందిన రైస్ మిల్ అసోసియేషన్ ఏది? రెండు అసోసియేషన్లతోనూ సమానంగా వ్యవహరిస్తారా? లేక ప్రభుత్వ రికార్డుల్లో నమోదైన సంస్థకే ప్రాధాన్యం ఇస్తారా? ఈ ప్రశ్నలకు సంబందించిన అధికారుల నుండి సమాధానం రాకపోతే, రైస్ మిల్లర్లలో నెలకొన్న అయోమయం మరింత పెరిగే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.