ఆప్తమిత్రున్ని కోల్పోయా
‘పెద్ది’ రాజకీయ ప్రస్థానం ఆదర్శప్రాయం
సుదర్శన్ రెడ్డి మరణం పట్ల మాజీ సీఎం కేసీఆర్ సంతాపం
కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసా
హైదరాబాద్, జూలై 31 (విజయక్రాంతి): తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు పెద్ది సుదర్శన్‌రెడ్డి మరణంతో తానొక ఆప్త మిత్రు న్ని, ఉద్యమ సహచరున్ని కోల్పోయానని మాజీ సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
పెద్ది సుదర్శన్‌రెడ్డి మరణించడం పట్ల కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు, పార్టీ కార్యకర్తలకు, పెద్ది అభిమానులకు ప్రగాఢసానుభూతి ప్రకటించారు. పెద్ది కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని, కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. ఉద్యమంలో తనతోపాటు కలిసి నడిచిన జ్జాపకా లను కేసీఆర్ స్మరించుకున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నర్సంపేట గడ్డపై బీఆర్‌ఎస్ గులాబీ జెండాను ఎగురవేసి, మొక్కవోని ధైర్యంతో ఉద్యమించిన ధీరుడు సుదర్శన్ రెడ్డి అని కొనియాడారు.
నియోజకవర్గ అభివృద్ధిలో చెరగని ముద్ర వేసుకున్నారన్నారు. పార్టీ పట్ల అత్యంత విధేయతో పనిచేసిన పెద్ది సుదర్శన్‌రెడ్డి మరణం పార్టీకి తీరని లోటని కేసీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. పోలీసుల ఒత్తిళ్లు, కేసులు, జైలు నిర్బంధాలకు లొంగలేదని, ఆయన ఉద్యమ పటిమ, ధైర్య సాహసాలు, స్ఫూర్తి నియోజకవర్గ కార్యకర్తలు ప్రజల హృదయాల్లో చెరగని ముద్రవేసుకుంటాయని స్పష్టం చేశారు. ఈ కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు కేసీఆర్ సూచించారు.
పెద్ది సేవలు చిరస్మరణీయం: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు
తెలంగాణ ఉద్యమంలో ఆయన సేవలు చిరస్మరణీయం. మృతి తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. సంతాపం వ్యక్తం చేశారు. నర్సంపేట నియోజకవర్గం, ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లో ఆయన పోషించిన పాత్ర విశిష్టమై నది. సామాన్య కుటుంబం నుంచి ప్రజా విశ్వాసాన్ని చూరగొని ఎమ్మెల్యేగా ప్రజల కోసమే జీవితాన్ని అంకితంచేశారు. ఆయన పవిత్ర ఆత్మకు భగవంతుడు శాంతి చేకూర్చాలి.
పెద్ది మరణం బాధాకరం: -కేంద్ర మంత్రి బండి సంజయ్..
మాజీ ఎమ్మెల్యే, సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం బాధాకరం. తెలంగాణ ఉద్యమంలో పెద్ది చురుకైన పాత్రపోషించారు. సుదర్శన్‌రెడ్డి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి. ఆయన ఆత్మకు శాంతికలగాలని ప్రార్థిస్తున్నా.
పెద్ది మరణం కలచివేసింది: బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్..
ఉద్యమ సహచరుడు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి మరణవార్త తనను తీవ్రంగా కలచివేసింది. బాధాతప్తహృదయంతో ఆయనకు నివాళులు. తెలంగాణ మలిదశ ఉద్యమానికి ఊపిరి పోయడంలో కీలక పాత్ర పోషించారు.






