26 May, 2026 | 2:26 AM

చుక్కలనంటిన ధరలు!

26-05-2026 12:37 AM

సామాన్యులలో గుబులు

ఘట్ కేసర్, మే 25 (విజయక్రాంతి) : ఏ వస్తువు ధర చూసినా ఆకాశాన్ని అంటుతుండడంతో సామాన్య ప్రజల జీవన పరిస్థితి మరీ దారుణంగా మారిందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏడాదికి ఏడాది ఏ వస్తువు ధరలు చూసినా దాదాపు 50 శాతానికి పైగా ధరలు పెరిగిపోయా యని, ఏమితినాలన్నా, ఏమికొనాలన్నా సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోయాయని ప్రజలు లబోదిబోమంటున్నారు. కనీసం రోజు వండుకునే కూరగాయల ధరలు కూడా ఏనాడు లేనంతగా ధరలు పెరగడంతో 50 సంవత్సరాల క్రితం మాదిరి ఉప్పుకారాలతో తినిబతికే రోజులు మళ్లీ వచ్చాయని అంటున్నారు.

బియ్యంతో పాటు ఏకూరగాయల ధరలు చూసినా కిలో రూ. 40 కి పైగానే ఉన్నాయని దీంతో నెల సంపాదనలో అదనంగా కూరగాయలకే ఖర్చు చేయాల్సి వస్తోందని అంటున్నారు. రోజురోజుకు నిత్యావసర ధరలు పెరుగుతున్నా సామాన్య మానవునికి మాత్రం వేతనం పెరుగకుండా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న మాదిరిగా జీవనం సాగిస్తున్నారు. రేషన్ కార్డుల పై ఆధారపడిన కుటుంబాలకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో కార్డులను అందించక పోవడంతో జీవనం మరింత భారంగా మారిందని పలువురు ఆరోపిస్తున్నారు.

గత ఎన్నికలకు ముందు రేషన్ కార్డులు ఇస్తామని చెప్పడంతో రోజుల తరబడి గత మండల కార్యాలయం వద్ద ఫోటోలు దిగి సంవత్సరాలు దాటినా ఇంత వరకు పూర్తిస్థాయిలో ఎందుకు అందించడం లేదో అర్థం కావడం లేదని, ఇందుకు ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యమే కారణమని పలువురు ఆరోపిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంపిణీ చేస్తున్న ఉచిత బియ్యంను అర్హులమైన తాము పొందకుండా పోతున్నామని పలువురు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం అర్హులకు రేషన్ కార్డులను పూర్తిస్థాయిలో అందించాలని ప్రజలు కోరుతున్నారు. 

ఇరాన్‌పై అమెరికా యుద్ధం కూడా ధరల పెరుగుదలకు ఒక కారణం

నిత్యవసర వస్తువులపై విపరీతంగా పెరుగుతున్న అధిక ధరలకు అమెరికా, ఇజ్రాయిల్ కలిసి ఇరాన్ పై చేస్తున్న యుద్ధం కూడా ఈ ధరల పెరుగుదలకు ఓ కారణంగా చెప్పుకోవచ్చు. యుద్ధం కారణంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగి రవాణా వ్యవస్థపై అధిక భారం పడటం కూడా ధరల పెరుగుదలకు కారణం. ఏది ఏమైనా నిత్యవసర వస్తువుల ధరలు భారీగా పెరగడంతో సామాన్య ప్రజల జీవనస్థితిగతులు అయోమయంగా మారింది.