క్రిమినల్ వేస్ట్ కాదు.. తెలంగాణ శిల్పులు
- సీఎం వ్యాఖ్యలపై ‘ఫతి’ ఆగ్రహం
- వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని డిమాండ్
- ఫీజు రీయింబర్స్‌మెంట్ ఉన్నత విద్యను దెబ్బతీస్తోంది
హైదరాబాద్, జూలై 31 (విజయక్రాంతి): ఇంజినీరింగ్ విద్యార్థులు క్రిమినల్ వేస్ట్ కాదు.. రేపటి తెలంగాణ శిల్పులని తెలంగాణ ఉన్నత విద్యాసంస్థల యాజమాన్యాల సమాఖ్య (ఫతి) స్పష్టం చేసింది. రాష్ట్రంలోని లక్షలాది మంది ఇంజినీరింగ్ విద్యార్థులు, గ్రాడ్యుయేట్‌లు, తల్లిదండ్రులు, అధ్యాపకులు, విద్యాసంస్థల మనోధైర్యాన్ని తీవ్రంగా దెబ్బతీసేవిగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలున్నాయని పేర్కొంది. ఈ మేరకు శుక్రవారం ‘ఫతి’ ప్రతినిధులు సమావేశమై ప్రకటనను విడుదల చేశారు.
సీఎం, మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి వ్యాఖ్యలు దురదృష్టకరమన్నారు. 180 ఇంజినీరింగ్ కళాశాలలతో దేశంలోనే అతిపెద్ద ఇంజినీరింగ్ విద్యా కేంద్రాలలో తెలంగాణ ఒకటన్నారు. ప్రైవేట్ విద్యాసంస్థల నుంచి 10 లక్షల కంటే ఎక్కువ మంది ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు ఉత్తీర్ణులయ్యారని, ఈ గ్రాడ్యుయేట్లే ప్రపంచంలోని మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, ఆపిల్, మెటా, ఒరాకిల్ లాంటి ప్రపంచస్థాయి సంస్థల్లో రాణిస్తున్నారని పేర్కొన్నారు.
ప్రభుత్వం విద్యాసంస్థలను దేశ నిర్మాణంలో భాగస్వాములుగా చూడాలని, ధైర్యాన్ని నింపాలన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ ఉన్నత విద్యను దెబ్బతీసిందని, రూ.12 వేల కోట్లకుపైగా బకాయిలు పేరుకుపోయాయని, ఇది విద్యాప్రమాణాలను ప్రభావితం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
వెంటనే సీఎం క్రిమినల్ వేస్ట్ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని, ఫీజు బకాయిలు విడుదల చేయాలని లేకుంటే పోరాటం తప్పదని ఫలి చైర్మన్ డాక్టర్ ఎన్. రమేష్ బాబు, సెక్రటరీ జనరల్ కెఎస్.రవికుమార్, ట్రెజరర్ కే కృష్ణారావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ కే సునీల్ రావులు హెచ్చరించారు.






