మాజీ ఎమ్మెల్యే రేగాపై కేసు
- ఇంటర్వ్యూ సాకుతో పిలిచి లైంగిక వేధింపులు
- ఆర్థికంగానూ మోసగించారని యువతి ఫిర్యాదు
- పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు
- హైకోర్టును ఆశ్రయించిన కాంతారావు!
పంజాగుట్ట, జూలై 31(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు రేగా కాంతారావుపై హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఇంటర్వ్యూ సాకుతో పిలిపించి లైంగిక వేధింపులకు గురిచేయడమే కాకుండా, ఆర్థికంగానూ మోసం చేశారని ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ చర్యలు చేపట్టారు.
అయితే ఇది పూర్తి అబద్ధమని, ఈ కేసును కొట్టేయాలని సదరు మాజీ ఎమ్మెల్యే హైకోర్టును ఆశ్రయించినట్లు సమాచారం. మీడియా రంగంలో పనిచేస్తున్న 22 ఏళ్ల బాధితురాలు జూలై 26న పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించింది. 2022లో ఓ ఇంటర్వ్యూ నిమిత్తం రేగా కాంతారావు తనను ఒక ఫ్లాట్‌కు పిలిపించారని, అక్కడ తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొంది.
ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా లొంగదీసుకున్నారని, ఆ సమయంలో ఫొటోలు, వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడినట్లు ఆరోపించింది. అంతేకాకుండా, రియల్ ఎస్టే ట్ వ్యాపారంలో పెట్టుబడి పేరుతో తన నుంచి రూ.4 లక్షలు వసూలు చేసి, తిరిగి ఇవ్వ కుండా మోసం చేశారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. తన మొబైల్ ఫోన్‌కు యాక్సెస్ పొంది, తన స్నేహితురాలితో కూడా ఇదే విధంగా పరిచయం పెంచుకునేందుకు ప్రయత్నించారని ఆరోపించింది.
ఈ మేరకు బీఎన్‌ఎస్‌లోని వివిధ సెక్షన్ల కింద కేసు నమో దు చేసి, ఆరోపణలపై అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్ పూర్తి అబద్ధమని, రాజకీయ దురుద్దేశంతోనే ఈ ఆరోపణలు చేశారని రేగా కాంతారావు స్పందించినట్లు తెలుస్తోంది. సదరు ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని కోరుతూ ఆయన తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు సమాచారం.






