ఎల్‌ఆర్‌ఎస్‌కు మరో 4 నెలల గడువు
- 25 శాతం రాయితీ కొనసాగింపు
- ఉత్తర్వులు జారీ చేసిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్‌రంజన్
హైదరాబాద్, జూలై 31 (విజయక్రాంతి): రాష్ట్రంలోని అనుమతిలేని లేఅవుట్లను క్రమబద్ధీకరించుకునేందుకు (ఎల్‌ఆర్‌ఎస్) ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఎల్‌ఆర్‌ఎస్ ఫీజులు, చార్జీలపై అమలులో ఉన్న 25 శాతం రాయితీ గడువును ఆగస్టు 1 నుంచి నవంబర్ 30 వరకు మరో నాలుగు నెలలు పొడిగిస్తూ మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధిశాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు.
ఇప్పటికే ప్రభుత్వం ఈ ఏడాది మే 1 నుంచి జూలై 31 వరకు రాయితీతో ఫీజులు చెల్లించే అవకాశం కల్పించింది. అయితే ఈ కాలంలో రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ల స్పెషల్ ఇం టెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) కార్యక్రమం నిర్వహించడంతో ప్లానింగ్ అధికారులు, ఉద్యోగులను ప్రత్యేక విధుల్లో వినియోగించారు. దీంతో ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ మందగించింది. అదే సమయంలో దరఖాస్తుదారుల నుంచి కూడా ఆశించినస్థాయిలో ఫీజుల చెల్లింపులు జరగలేదు.
ఫీజులు చెల్లించిన అనేక మందికి కూడా సకాలంలో రెగ్యులరైజేషన్ ప్రొసీడిం గ్స్ జారీ కాలేదనే విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం గడువును మరోసారి పొడిగించినట్టు తెలుస్తున్నది. గత ఏడాది ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్ ఫీజులపై 25 శాతం రాయితీ ప్రకటిస్తూ 2026 మార్చి 31 వరకు అవకాశం ఇచ్చింది.
ఈ పథకం ద్వారా సుమారు రూ.10 వేల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేసినప్పటికీ, ఇప్పటివరకు మూడు విడతలుగా గడువు పొడిగించినా ప్రభుత్వానికి సుమారు రూ.2 వేల కోట్ల ఆదాయం మాత్రమే సమకూరింది. ఎస్‌ఐఆర్ ప్రక్రియ వల్ల దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం చోటుచేసుకున్న నేపథ్యంలో, పెండింగ్ దరఖాస్తుల పరిశీలన పూర్తిచేసి మరింత మంది లబ్ధిదారులు రాయితీ ప్రయోజనం పొందేందుకు ప్రభుత్వం మరో నాలుగు నెలల గడువు కల్పించింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుదారులు రాయితీతో ఫీజులు చెల్లించాలని ప్రభుత్వం విజ్ఞప్తిచేసింది.






