స్టూడెంట్ కిసాన్ గర్జన
- బీహార్ రాజధాని పాట్నా ఉద్రిక్తం
- బీపీఎస్సీ అక్రమాలపై విద్యార్థులు కన్నెర్ర
- సీఎం సామ్రాట్ ఇంటి ముట్టడికి ర్యాలీ
- ‘పాటలీపుత్ర టౌన్‌షిప్’కు సర్కార్ భూసేకరణపై రైతుల ఆగ్రహం
- విద్యార్థుల ఉద్యమానికి రైతాంగం మద్దతు
- ఆందోళనకారులపై లాఠీచార్జి.. పలువురికి గాయాలు
- పోలీసుల వాటర్ క్యానెన్ల ప్రయోగం
పాట్నా, ఆగస్టు ౨౫: బీహార్‌లో ఒకేరోజు విద్యార్థులు, రైతులు కదంతొక్కారు. ప్రభుత్వ వ్యవస్థల్లోని లోపాలను నిలదీస్తూ గర్జించా రు. బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (బీపీఎస్సీ) పరీక్షల్లో అవకతవకలను నిలదీస్తూ విద్యార్థులు ఉద్యమించగా, పాటలీ పుత్ర గ్రీన్‌ఫీల్డ్ శాటిలైట్ టౌన్‌షిప్ పేరిట వ్యవసాయ భూ ముల సేకరణపై కన్నెర్ర చేస్తూ రైతులు దీక్ష చేపట్టారు. మొదట వేర్వేరుగా ప్రారంభమైన ఈ రెండు నిరసన కార్యక్రమాలు, క్రమంగా ఒక్కటి కావడంతో పాట్నా అట్టుడికింది.
విద్యార్థి నేతలు ‘మహా మార్చ్’ పేరిట ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి ఇంటి ముట్టడికి పిలుపునివ్వగా, రాష్ట్ర నలుమూలల నుంచి మంగళవారం ఉదయం వేలాది మంది విద్యార్థులు రాజధాని పాట్నా చేరుకున్నారు. గాంధీ మైదాన్ వద్ద ర్యాలీ ప్రారంభమైంది. విద్యార్థులు అక్కడి నుంచి సీఎం నివాసం వైపు కదిలారు. మార్గమధ్యంలో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేయగా, విద్యార్థులు వా టిని తోసేసి ముందుకు వెళ్లేందుకు యత్నించారు. ఒకదశలో ఇరువర్గాల మధ్య తోపు లాట జరిగి ఘర్షణకు దారి తీసింది. దీంతో పోలీసులు లాఠీచార్జికి దిగారు. లాఠీచార్జిలో కొందరు విద్యార్థులు గాయపడ్డారు. మరికొందరు పోలీసులు కూడా క్షతగాత్రుల య్యారు. ఉద్రిక్తతల నడుమనే విద్యార్థులు ర్యాలీగా సీఎం నివాసానికి చేరువగా వెళ్లారు.
అక్కడ ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్ కెనాన్లను ప్రయో గించారు. ఈ ర్యాలీలో భూసేకరణను వ్యతిరేకిస్తున్న రైతులు కూడా నల్లజెండాలు పట్టు కుని భాగస్వాములు కావడం గమనార్హం. విద్యార్థుల నిరసనకు రైతులు కూడా తోడవడంతో పరిస్థితి జటిలమైంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది. పాట్నాలో సీఆర్పీఎఫ్ బలగాలను భారీగా మోహరింపజేసింది.
స్పందించిన బీహార్ సర్కార్
విద్యార్థుల ర్యాలీపై బీహార్ ప్రభు త్వం సత్వరం స్పందించింది. విద్యార్థుల సమస్యలను పరిష్కరించేందుకు ‘విద్యార్థి సహయోగ్ శిబిరం’ పేరుతో నెలవారీ డ్రైవ్ నిర్వహిస్తామని ప్రకటించింది. ప్రతి నెలా నాలుగో మంగళవారం ప్రతి విద్యాసంస్థలో శిబిరం నిర్వహిస్తామని హామీ ఇచ్చింది. శిబి రాల ద్వారా విద్యార్థులు నేరుగా తమ సమ స్యలు పరిష్కరించుకునేందుకు అవకాశం ఉంటుందని తెలిపింది. అలాగే, విద్యార్థులు తమ సమస్యలు తెలిపేందుకు లేదా ఫిర్యా దు చేసేందుకు ప్రత్యేకంగా 1100 అనే ఉచిత హెల్ప్‌లైన్ నంబర్ ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టం చేసింది.
భూసేకరణపై భగ్గుమన్న రైతాంగం
రాజధానిలో సర్కార్ ఏర్పాటు చేయనున్న ‘పాటలీపుత్ర గ్రీన్‌ఫీల్డ్ శాటిలైట్ టౌన్‌షి ప్’కు వ్యవసాయ భూముల సేకరణను వ్యతి రేకిస్తూ రైతులు నిరసన కార్యక్రమం చేపట్టా రు. అభివృద్ధి పేరిట వ్యవసాయ భూముల ను సర్కారు కార్పొరేట్ సంస్థలకు కట్టబెడు తున్నదని ఆరోపించారు. తమ అభీష్టానికి వ్యతిరేకంగా తమ భూములను లాక్కునేం దుకు యత్నిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.
తమ కుటుంబాలకు భూమి మాత్రమే జీవనాధారమని, అలాంటి భూమిని గుంజు కుంటే కుటుంబాలు రోడ్డున పడతాయని కన్నీరు పెట్టుకున్నారు. వారసత్వంగా సంక్ర మించిన, కష్టార్జితంతో సంపాదించుకున్న భూములను దక్కించుకోవాలని తాము పో రాడుతుంటే, సర్కార్ తమపై పోలీసులను ఉసిగొల్పుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశా రు. సర్కార్ దిగివచ్చి తమ డిమాండ్లను పరి ష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృ తం చేస్తామని, నిరసన కార్యక్రమాల్లో విద్యార్థులనూ భాగస్వాములను చేస్తామని హెచ్చరించారు.
విద్యార్థుల ప్రధాన డిమాండ్లు
బీపీఎస్సీ నిర్వహించిన అన్ని పోటీ పరీక్షల్లో అవకతవకలు జరిగాయని, కాబట్టి కమిషన్ పరిధిలో కాకుండా బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిటీ (బీఎస్‌ఎస్‌సీ) ద్వారా పరీక్షలు నిర్వహించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. బీపీఎస్సీ నిర్వహించిన ౭౦వ పోటీ పరీక్షలో అవకతవకలు జరిగాయని, ఆ పరీక్షను బేషరతుగా రద్దు చేయాలని నినదించారు. అలాగే, టీఆర్‌ఈెే-4 పరీక్షను సింగిల్ -టయర్ విధానంలో నిర్వహించాలని కోరారు.
పోటీ పరీక్షల నిర్వహణ, కొలువుల నియామక ప్రక్రియలో వందశాతం పారదర్శకత అమలు కావాలని పట్టుబట్టారు. హిందీ మాధ్యమంలో చదువుకున్న అభ్యర్థులకు, నియామక ప్రక్రియలో వివక్ష చూపడకూడదని కోరారు. ప్రశ్నపత్రాల లీకేజీలు, పరీక్షల వాయిదాల వల్ల తమ భవిత ప్రశ్నార్థకం అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ డిమాండ్లపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి, చర్చలకు పిలవకుండా, కిందిస్థాయి అధికారులతో చర్చలు జరపాలని కోరడం సరికాదని మండిపడ్డారు. తమ డిమాండ్లపై ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి లేదా విద్యాశాఖ మంత్రి మిథిలేష్ తివారీ స్పందించాలని కోరారు. వారిద్దరిలో ఒకరు రాత పూర్వక హామీ ఇస్తే తప్ప, తాము నిరసన కార్యక్రమాలు విరమించేది లేదని తేల్చిచెప్పారు.






