కళ్లు మూసుకున్నాం.. కానిచ్చేయండి!
- అక్రమ నిర్మాణాలకు ‘రాజేంద్రనగర్ సర్కిల్’ అడ్డా
- నిబంధనలు గాల్లోకి...
- కలెక్షన్ కింగ్‌గా మారిన ‘ఔట్‌సోర్సింగ్’ వ్యక్తి
రాజేంద్రనగర్, ఆగస్టు 25 (విజయక్రాంతి): రాజేంద్రనగర్ జిహెచ్‌ఎంసి సర్కిల్ పరిధిలో అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. టౌన్ ప్లానింగ్ అధికారులు మేం కళ్ళు మూసుకున్నాం... మీరు కానిచ్చేయండి అన్నట్లుగా వ్యవహరిస్తుండటం సర్కిల్ పరిధిలో అక్రమ నిర్మాణాలు కొకోల్లలుగా వెలుస్తుండడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఇటీవల హైదరాబాద్ గచ్చిబౌలిలో జరిగిన ప్రమాదం కంటే భారీ స్థాయిలో ఇక్కడ నిబంధనల ఉల్లంఘనలు జరుగుతున్నప్పటికీ, బాధ్యత కలిగిన అధికారులు కనీసం కన్నెత్తి చూడకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది.
కాసులకు కక్కుర్తి
టౌన్ ప్లానింగ్ విభాగంలో పనిచేస్తున్న కొందరు అధికారులు తమ ఉద్యోగ ధర్మాన్ని పక్కనబెట్టి, కాసులకు కక్కుర్తి పడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనలను బేఖాతరు చేస్తూ విచ్చలవిడిగా భవనాలు నిర్మిస్తున్న బిల్డర్ల నుంచి అక్రమ మార్గంలో పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడుతున్నట్లు సమాచారం.
ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి వసూల్ రాజా
ఈ అక్రమ దందాలో టౌన్ ప్లానింగ్ విభాగంలో పనిచేసే ఓ ఔట్సోర్సింగ్ ఉద్యోగి కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. సదరు వ్యక్తి భవన యజమానుల వద్ద తన ’విశ్వ’రూపం చూపిస్తూ, ’కలెక్షన్ కింగ్’గా అవతారమెత్తాడని ప్రచారం జరుగుతోంది. సదరు ఉద్యోగి అడిగినంత ముట్టజెప్తే ఎలాంటి అనుమతులు లేకపోయినా నిర్మాణం సవ్యంగా సాగిపోతుందనే టాక్ వినిపిస్తోంది. దీనిపై పలు రాజకీయ పార్టీల నాయకులు బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు.
నకిలీ ’ఓసీ’లపై అనుమానాలు
భారీ భవనాల నిర్మాణంలో టౌన్ ప్లానింగ్ అధికారులు నకిలీ ఓసీ లు జారీ చేస్తున్నారనే విమర్శలు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి. అపార్ట్మెంట్ల నిర్మాణానికి తీసుకున్న ప్రాథమిక అనుమతులకు, నిర్మాణం పూర్తయ్యాక అధికారులు ఇచ్చే ఓసీలకు అస్సలు పొంతన ఉండటం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
స్నేహిత హిల్స్ ఘటన
స్నేహిత హిల్స్ ప్రాంతంలో ఓసీలు పొందిన అనంతరం కూడా కొందరు బిల్డర్లు అదనపు అంతస్తులను నిర్మిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అయినప్పటికీ రాజేంద్రనగర్ టౌన్ ప్లానింగ్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.
50, 80 గజాల్లో అక్రమ అంతస్తులు
సర్కిల్ పరిధిలో 50, 80 చదరపు గజాల చిన్న ప్లాట్లలో సైతం ఎటువంటి నిబంధనలు పాటించకుండా నిర్మించిన బహుళ అంతస్తుల భవనాలు కోకొల్లాలుగా దర్శనమిస్తున్నాయి. గతంలో ఇక్కడ పనిచేసిన ఒక టౌన్ ప్లానింగ్ అధికారి పెద్ద ఎత్తున మామూళ్లు వసూలు చేసి, ఆరోపణలు తీవ్రస్థాయికి చేరడంతో పైరవీలు చేసుకుని మరీ బదిలీపై వెళ్లిపోయినట్లు టాక్.భవన నిర్మాణ నిబంధనలను దారుణంగా ఉల్లంఘిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న బిల్డర్లపై, వారికి సహకరిస్తున్న టౌన్ ప్లానింగ్ సిబ్బందిపై ఉన్నతాధికారులు తక్షణమే దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.






