డిప్యుటేషన్లలో నిబంధనలకు తిలోదకాలు
సర్దుబాటు పేరుతో ప్రైమరీ టీచర్లకు హైస్కూల్ డిప్యుటేషన్లు
సికింద్రాబాద్,ఆగస్టు30(విజయక్రాంతి): నగరంలో ఇప్పటికే ప్రభుత్వ ఉపాధ్యాయుల ను ఎమ్యూమరేషన్ పనులకు కేటాయించగా, సబ్జెక్టు టీచర్ల సర్డుబాటులో పేరుతో అధికారులు జారీ చేసిన డిప్యుటేషన్ ఉత్తర్వులు ప్రైమరీ పాఠశాలల ఉపాధ్యాయులకు కొత్త ఇబ్బందులు తెచ్చి పెడుతున్నాయి.
ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల కొరత ఉందంటూ సర్దుబాటు పేరుతో డిప్యూటేషన్ ఉత్తర్వులు జారీ చేసిన అధికారులు డిప్యూటేఫన్ నిబంధనలకు మాత్రం తిలోదకాలు ఇచ్చారని పలువురు ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి.
ముఖ్యంగా హైస్కూళ్లల్లో సబ్జెక్టు టీచర్ల కొరత ను నివారించేందుకు గాను హైస్కూళ్లలో ఎక్సెస్ ఉన్న టీచర్లకు కొరత ఉన్న పాఠశాలలకు డిప్యూటేషన్ వేయాల్సి ఉండగా, అందుకు భిన్నంగా ప్రైమరీ స్కూళ్లలో పనిచేస్తున్న వారిని హైస్కూళ్లకు డిప్యూటీషన్ వేశారని ఇది నిబంధనలకు విరుద్ధమని టీచర్లు వాపోతున్నారు.
ఈ డిప్యూటీషన్ ప్రక్రియలో కూడా సీనియర్, జూనియర్ అనే నిబంధనలకు పాటించకుండా తమకు ఇష్టమొచ్చిన రీతిలో జూనియర్ టీచర్లను వదిలి సీనియర్లకు డిప్యూటేషన్ వేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్ జిల్లా పరిధిలో 691 ప్రభుత్వు ఉన్నత, ప్రాథమికోన్నత,ప్రాథమిక పాఠశాలలున్నాయి. ఇందులో ప్రస్తుతం 94,321 మంది చదువుతుండగా సుమారు 5,260 మంది ఉపాధ్యాయులు బోధిస్తున్నారు. వివిధ మండలాల్లో విద్యార్థుల సంఖ్యకు సరిపడా టీచర్లు లేకపోవడం,
కొన్నిచోట్ల టీచర్లు ఎక్కువగా ఉండటం సర్వ సాధారణంగా ప్రతి ఏటా జరుగుతుంది.అయితే టీచర్లు లేని చోట ఇతర ప్రాంతాల నుంచి ప్రతి ఏటా డిప్యూటేషన్లపై వర్క్ అడ్జస్ట్మెంట్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 19న పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు డీఈవో 69 మంది ఉపాధ్యాయులకు సర్దుబాటు కింద ఉత్తర్వులు జారీ చేశారు. వర్క్ అడ్జెస్ట్‌మెంట్ కింద 69 మందికి డిప్యూటేషన్ వేయగా అందులో ఇప్పటికే 39 మంది ఆయా పాఠశాలల్లో చేరిపోయారు.
అయితే అధికారులు ఇచ్చిన డిప్యూటేషన్ ఉత్తర్వులు నిబంధనలకు విరుద్దంగా ఉన్నాయని, జూనియర్లను మాత్రమే డిప్యూటేషన్ డ్యూటీలు వేయాల్సిన అధికారులు అందుకు భిన్నంగా తమకు ఇష్టమొచ్చి న రీతిలో సీనియర్ టీచర్లకు ఆర్డర్లు జారీచేశారని పేర్కొన్నారు.






