మున్సిపల్ కార్యాలయం ఎదుట అఖిలపక్షం వార్డు కౌన్సిలర్ల నిరసన
చౌటుప్పల్, ఆగస్టు 27: చౌటుప్పల్ మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట అఖిలపక్షం వార్డు కౌన్సిలర్లు గురువారం నిరసనకు దిగారు. కౌన్సిల్ సమావేశాన్ని బహిష్కరించి మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. మున్సిపల్ కమిషనర్ మినిట్ బుక్, ఎంపీ రికార్డు, తొలి కౌన్సిల్ సమావేశంలో చేసిన తీర్మానాలను చూపించకపో వడంపై కౌన్సిలర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
ప్రజాప్రతినిధులు అడిగిన రికార్డులను అందుబాటులో ఉంచకుండా ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదని మండిపడ్డారు.అదేవిధంగా మున్సిపల్ కార్యాలయ మరమ్మతుల కోసం విడతల వారీగా ఖర్చు చేసినట్లు చెబుతున్న రూ.40 లక్షల నిధులపై వివరాలు అడిగినా సమాధానం ఇవ్వడం లేదని వారు ఆరోపించారు. మున్సిపాలిటీలో చేపట్టిన వివిధ పనులపై ప్రశ్నిస్తే అధికారులు స్పష్టమైన సమాచారం ఇవ్వకపోవడం విడ్డూరంగా ఉందన్నారు.
కమిషనర్ ఏకపక్ష నిర్ణయాలను మానుకోవాలని, కౌన్సిలర్లకు అవసరమైన రికార్డులు, పనుల వివరాలు పారదర్శకంగా అందించాలని డిమాండ్ చేశారు. మున్సిపాలిటీ వ్యవహారాల్లో ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేస్తూ నిబంధనల ప్రకారం పాలన సాగించాలని కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కొయ్యడ శేఖర్ గౌడ్, బిజెపి ఫ్లోర్ లీడర్ బుడ్డ సురేష్, వార్డు కౌన్సిలర్లు ఊదరి యాదయ్య, గడ్డం ఇందిరా రాజరత్నం, పోలేపల్లి లక్ష్మీ ముత్యాలు తదితరులు పాల్గొన్నారు.






