30 July, 2026 | 2:49 AM

నావన్నీ సమాజానికి దగ్గరి కథలే!

30-07-2026 12:00 AM

సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేశ్‌బాబు అన్న కుమారుడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయమవుతున్న చిత్రం ’శ్రీనివాస మంగాపురం’. అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ద్వారా బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడానిని కూడా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెడుతోంది. ఈ చిత్రంలో సీనియర్ నటుడు మోహన్‌బాబు ఓ శక్తిమంతమైన పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రం జూలై 30న విడుదల కానుంది.

ఈ సందర్భంగా దర్శకుడు అజయ్ భూపతి విలేకరులతో సినిమా విశేషాలు పంచుకున్నారు. “శ్రీనివాస మంగాపురం’ పూర్తి స్థాయి ప్రేమకథా చిత్రం. చాలా బలమైన, భావోద్వేగ భరితమైన కథతో రూపొందించిన ఫిక్షన్ స్టోరీ. నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా కూడా కొన్ని సన్నివేశాలు రాశాను. ఇందులో లవ్‌స్టోరీతోపాటు సూపర్ ఎమోషన్స్ ఉంటాయి. మోహన్‌బాబు పాత్రతోపాటు ఇంకా చాలా మంచి క్యారెక్టర్స్ ఉన్నాయి.

నరేశ్ వీకే క్యారెక్టర్‌ను ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తారు. కృష్ణ కుటుంబం నుంచి ఒక హీరోని పరిచయం చేయడం అంటే కచ్చితంగా బాధ్యత, ఒత్తిడి ఉంటుంది. అయితే, -నేను మొదట్లో అది పట్టించుకోలేదు. నిజానికి నేను ఎప్పుడూ నా స్టైల్లోనే సినిమాలు చేసుకుంటూ వెళ్తా. వాళ్లు కూడా నా శైలికే వదిలేశారు. కాకపోతే జయకృష్ణతో ఒక జర్నీ మొదలైన తర్వాత నేను చాలా ఎమోషనల్ అయ్యా. నాకు కృష్ణ అంటే చాలా అభిమానం.

ఆయన లెగసీ నాకు తెలుసు. జయకృష్ణ వ్యక్తిగతంగా నాకు చాలా నచ్చాడు. అందుకే, నేను దగ్గరుండి అన్ని విషయాల్లో చాలా జాగ్రత్త తీసుకున్నా. అన్ని టౌన్స్‌లాగే తిరుపతి కూడా ఒక మామూలు టౌన్. అక్కడా రౌడీయిజం ఉంది, గ్యాంగ్స్ ఉన్నాయి, గ్రూపులు ఉన్నాయి. నేను దాన్నే చూశా. మాకు ఎక్కడా ఎలాంటి అభ్యంతరాలు రాలేదు. జయకృష్ణ చాలా సిగ్గరి. చాలా ఇంట్రోవర్ట్. మహేశ్‌బాబులాగే తనలో కూడా మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది.

తన స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంటుంది. జయకృష్ణలో ఒక ప్రత్యేకమైన స్టైల్ ఉంది. అది సినిమా చూస్తున్నప్పుడు తెలుస్తుంది. రాషా తడానీకి ఏదో సాధించాలనే లక్ష్యం ఉంది. నిజానికి నేను ‘ఆర్‌ఎక్స్ 100’ తర్వాత కొత్త వాళ్లతో పని చేయకూడదని అనుకున్నా. కానీ, ఈ సినిమా చేసిన తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది. వాళ్లిద్దరి నుంచి నేను చాలా విషయాలు నేర్చుకున్నా.

నేను ఎక్కువగా జనాల్లోనే ఉంటా. బయట తిరుగుతుంటా. ప్రతి క్యారెక్టర్‌నూ గమనిస్తుంటా. దాదాపు కథలను సమాజం నుంచే తీసుకుంటా. ‘మంగళవారం 2’ గురించి -ఇప్పుడే ఎక్కువ చెప్పలేను. కాకపోతే ఒక విష యం ప్రామిస్ చేస్తున్నా. అందులో ఉండే ఎలిమెంట్స్, క్యారెక్టర్స్, గూస్‌బంప్స్ వచ్చే సీన్స్... ఇవన్నీ చూసి ఆడియన్స్ షాక్ అవుతారు.