13 June, 2026 | 4:11 AM

బీబీనగర్ ఎయిమ్స్ ప్రజలకు అంకితం

13-06-2026 12:29 AM
  1. వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి
  2. సనత్‌నగర్ ఈఎస్‌ఐకు అధికంగా వస్తున్న ఓపీ పేషెంట్లు
  3. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

అమీర్‌పేట్, జూన్ 12 (విజయక్రాంతి): బీబీనగర్ ఎయిమ్స్ నిర్మాణ పనులు వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తవుతాయని, పూర్తి స్థాయిలో ఆసుపత్రిని అందుబాటులోకి తెచ్చి తెలంగాణ ప్రజలకు అంకితం చేస్తామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. శుక్రవారం సనత్‌నగర్, అమీర్‌పేట డివిజన్లలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆయన సందర్శించారు. ఆయా కేంద్రాలకు ఆధునిక వైద్య పరికరాలను అందజేశారు.

ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రధానిగా పుష్కరకాలాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్నారన్నారు. దేశ స్వాతంత్య్రం అనంతరం అత్యధిక కాలం సేవలందించిన ప్రధాన సేవకుడిగా ప్రజలతో పాటు ప్రపంచ దేశాల మన్ననలను పొందారన్నారు. ప్రధానమంత్రి నాయకత్వంలో ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా ప్రతి నిరుపేద కుటుంబానికి రూ.5లక్షల విలువైన ఉచిత వైద్యం అందుతోందన్నారు.

నగరంలోని ఈఎస్‌ఐ మెడికల్ కాలేజ్ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, బీబీనగర్ ఎయిమ్స్ ఎంతగానో అభివృద్ధి చెందుతున్నాయన్నారు. రెండింటిలోనూ మెడికల్ కాలేజీల నిర్వహణ జరుగుతోందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణలోని గాంధీ, ఉస్మానియా ఆసుపత్రులతో పోలిస్తే సనత్‌నగర్‌లోని ఈఎస్‌ఐ ఆసుపత్రికి ఓపీ పేషెంట్లు అధికంగా వస్తున్నారన్నారు.

ఉద్యోగాలు చేసే మధ్యతరగతి ప్రజలకు ఈఎస్‌ఐ అద్భుతమైన వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చిందన్నారు. త్వరలోనే ఆసుపత్రిలో నూతనంగా నిర్మించిన ఓపీ బ్లాక్ ప్రారంభిస్తామని ప్రకటించారు. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వసతుల మెరుగుదలకు కృషి చేస్తున్నామని చెప్పారు.