అమ్మకానికి ఏఐ వధువులు
పెళ్లిళ్ల పేరిట భారీ మోసం
నకిలీ మ్యాట్రిమోనియల్ కాల్ సెంటర్ గుట్టురట్టు
9 మంది మహిళలతో సహా 11 మంది అరెస్ట్
లక్నో, జూలై 10: ఉత్తరప్రదేశ్ ఝాన్సీలో నకిలీ మ్యాట్రిమోనియల్ కాల్ సెంటర్ నడుపుతున్న ఒక ముఠాను పోలీసులు చేధించారు. పెళ్లిళ్లు చేస్తామంటూ అమాయకులను నమ్మించి భారీగా డబ్బులు వసూలు చేస్తున్న 11 మంది నిందితులను నవాబాద్ పోలీసులు, సైబర్ సెల్ అధికారులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. పట్టుబడిన వారిలో తొమ్మిది మంది మహిళలు ఉండటం గమనార్హం. రాయ్ కాలనీలో నడుస్తున్న కాల్ సెంటర్‌పై పోలీసులకు పక్కా సమాచారం అందింది.
దీంతో అడిషనల్ సిటీ మేజిస్ట్రేట్ అనుమతితో పోలీసులు ఆ ఇంటిపై అకస్మాత్తుగా దాడి చేశారు. ఈ ఆపరేషన్‌లో దాదాపు 9 లక్షల రూపాయల విలువైన మొబైల్ ఫోన్లు, మ్యాక్‌బుక్, కంప్యూటర్లు, ఏటీఎం కార్డులు, చెక్ బుక్కులు, బయోమెట్రిక్ మిషన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాకు సంబంధించిన ఏడు వివిధ బ్యాంక్ ఖాతాలలో సుమారు 41 లక్షల రూపాయల ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఆయా బ్యాంక్ ఖాతాలను స్తంభింపజేసే (ఫ్రీజ్) ప్రక్రియను ప్రారంభించారు. సాధారణ ఉద్యోగాల పేరిట ఈ కాల్ సెంటర్‌లో చేరిన నిందితులు, పెళ్లి సంబంధాల కోసం చూసే వారిని టార్గెట్ చేసుకుని మోసాలకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలింది.
బాధితులను ఆకర్షించడానికి ఈ ముఠా సరికొత్త టెక్నాలజీని వాడుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వారా సృష్టించిన అందమైన వధువుల ఫోటోలను బాధితులకు పంపించేవారు. ఆ ఫోటోలు నిజమైనవని నమ్మి పెళ్లికి సిద్ధపడే వారి నుంచి క్యూఆర్ కోడ్‌ల ద్వారా పెద్ద మొత్తంలో డబ్బులను బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయించుకునేవారు. ఈ కాల్ సెంటర్లో పనిచేసే ఉద్యోగు లకు నెలకు కొంత జీతంతో పాటు, అదనంగా కమీషన్లు కూడా ఇస్తున్నట్లు పోలీసు ల దర్యాప్తులో వెల్లడైంది. ఈ ముఠా వెనుక ఉన్న ప్రధాన సూత్రధారులు ఎవరనే విషయంపై పోలీసులు కేసు నమోదు చేసుకొని గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.






