11 July, 2026 | 1:59 AM

రైతు రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలి

11-07-2026 12:55 AM

ఏవో పి.అనురాధ రెడ్డి

మొయినాబాద్ జూలై 10 (విజయక్రాంతి): మండలంలోని రైతులందరూ రైతు రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని వెంటనే నమోదు పూర్తి చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి పి. అనురాధ సూచించారు. మండలంలోని అన్ని గ్రామాల్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతు రిజిస్ట్రేషన్ కార్యక్రమం కొనసాగుతోందన్నారు.

మండలంలో మొత్తం 22,254 మంది రైతుల నమోదు లక్ష్యంగా ఉండగా, ఇప్పటివరకు 8,734 మంది రైతులు నమోదు చేసుకున్నారని తెలిపారు. ఇంకా 13,520 మంది రైతుల నమోదు పెండింగ్లో ఉండగా, ఇప్పటివరకు 39.25 శాతం నమోదు పూర్తయిందన్నారు. గురువారం ముర్తుజగూడ, శ్రీరామ్నగర్ గ్రామాల్లో కూడా రైతు రిజిస్ట్రేషన్ కార్యక్రమం నిర్వహించినట్లు చెప్పారు.

రైతులు ఆధార్ కార్డు, పట్టాదార్ పాస్బుక్ లేదా భూ రికార్డులు, ఆధార్కు అనుసంధానమైన మొబైల్ నంబర్తో నమోదు చేసుకోవాలని సూచించారు. రైతు రిజిస్ట్రేషన్ ద్వారా ప్రత్యేక డిజిటల్ గుర్తింపు లభించడంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రైతు సంక్షేమ పథకాలు, పీఎం-కిసాన్, పంటల బీమా, సబ్సిడీలు తదితర ప్రయోజనాలను సులభంగా పొందే అవకాశం ఉంటుందన్నారు. ఎరువుల బుకింగ్కు కూడా రైతు రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని పేర్కొన్నారు.ఇప్పటివరకు నమోదు చేసుకోని రైతులు తమ సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈఓ), మీసేవ లేదా సీఎస్సీ కేంద్రాలను సంప్రదించి వెంటనే రైతు రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని పి. అనురాధ కోరారు.