ఇంద్రాయి దేవత పూజలకు పోటెత్తిన ఆదివాసీలు
కాలినడకతో ఆలయానికి చేరుకున్న భక్తులు
ఉట్నూర్, ఏప్రిల్ 3 (విజయక్రాంతి): ఆదివాసి గోండుల ఆరాధ్య దేవత ఇంద్రాయి దేవతకు మొక్కులు తీర్చుకునేందుకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు పక్క రాష్ట్రమైన మహారాష్ట్రకు చెందిన గోండు గిరిజనులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. శుక్ర వారం ఉదయం నుంచి ఉమ్మడి జిల్లాలోని ఆయా మండలాల పరిధిలోని గ్రామాల గిరిజనులు, మహిళలు మండుటెండను సైతం లెక్కచేయకుండా నడుచుకుంటూ ఆలయానికి చేరుకున్నారు.
ఆలయ పరిసర ప్రాంతంతో పాటు మార్కెట్ యార్డ్ భక్తులతో కిటకిటలాడింది. ఇంద్రాయి దేవతకు మొక్కు లు తీర్చుకునేందుకు దంపుడు బియ్యం నైవేద్యంతో పాటు, ఇప్ప పరక నూనెతో మినప పప్పు గారెలను తయారు చేసి నైవేద్యంగా సమర్పించారు. మహారాష్ట్రలోని చంద్రాపూర్, యావత్ మాల్, కిన్వాట్ తదితర ప్రాంతాల నుంచి గిరిజనులు తరలి వచ్చి దేవత మొక్కులు తీర్చుకున్నారు. వేలాదిగా భక్తులు తరలి రావడంతో ఇంద్రాయి దేవత ఆలయం జనసంద్రమైంది.




