10 April, 2026 | 10:02 PM

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలి

10-04-2026 07:45 PM

బీమినీలో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య పర్యటన

బెల్లంపల్లి,(విజయక్రాంతి): ప్రజా సంక్షేమంలో భాగంగా నిరుపేదల కొరకు ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య అన్నారు. శుక్రవారం జిల్లాలోని భీమిని మండలం రాంపూర్ గ్రామంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల  కార్యాచరణలో ఆయన పాల్గొన్నారు.

నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లు, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం క్రింద కొనసాగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ఇందిరమ్మ ఇండ్లు పొందిన లబ్ధిదారులు నిబంధనల ప్రకారం నిర్ణీత విస్తీర్ణంలో ఇండ్ల నిర్మాణం త్వరగా పూర్తి చేసుకోవాలని తెలిపారు. ఉపాధి హామీ పథకం క్రింద జరుగుతున్న పనులలో ఉపాధి కూలీల సంఖ్య పెంపొందించాలనిన్నారు. ప్రతి కుటుంబం 100 రోజుల పని పూర్తి చేసుకోవాలని తెలిపారు. కూలీలతో మాట్లాడుతూ అర్హులైన వారికి ప్రభుత్వం నుంచి గ్యాస్, విద్యుత్ రాయితీ, రేషన్ కార్డులు, పెన్షన్లు అందించడం జరుగుతుందని తెలిపారు.

గ్రామంలోని రోడ్డులో అవసరమైన చోట 2 కల్వర్టుల నిర్మాణం చేయాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా మల్లిడి గ్రామపంచాయతీ లోనీ గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. తదనంతరం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించి విద్యార్థుల ఎత్తు, బరువులను పరిశీలించి, విద్యార్థులకు మంచి ఆహారాన్ని ఇవ్వాలని, గ్రామంలోని బాలింతలు, గర్భిణీలకు పౌష్టికాహార భోజనం, పాలు అందించాలని తెలిపారు. అక్కడ కూడా గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. తదనంతరం భీమిని గ్రామపంచాయతీ సందర్శించి గ్రామంలోని అభివృద్ధి పనులను పరిశీలించారు.

అనంతరం మండల తహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించి రాంపూర్, ఇతర గ్రామాలకు సంబంధించి కొంతమంది భూ సమస్యలపై చేసిన ఫిర్యాదులు, రికార్డులు పరిశీలించి అట్టి ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పరిశీలించి రికార్డులతో సరిచూసి వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని తహసిల్దార్ ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి బి. గంగామోహన్, మండల పంచాయతీ అధికారి మహేష్, హౌసింగ్ ఏఈ చంద్రశేఖర్, ఎ పి ఓ సత్యప్రసాద్, ఈసీ రాజేంద్రప్రసాద్, మల్లిడి గ్రామ సర్పంచ్ కర్ణ మమత, బిట్టురుపల్లి గ్రామ సర్పంచ్ పి. దశరథ్, భీమిని గ్రామ సర్పంచ్ శ్రీకాంత్ గౌడ్, టెక్నికల్ అసిస్టెంట్ భార్గవ్, ఉపసర్పంచ్ లు, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శులు, క్షేత్ర సహాయకులు పాల్గొన్నారు.