ఓటు మీ హక్కు.. నిర్లక్ష్యం చేయకండి..
పోలింగ్ కేంద్రాల్లో అదనపు సీఈఓ తనిఖీలు
జూలై 24 వరకు ఎస్‌ఐఆర్ ప్రక్రియ
ఫారాలు పూర్తి చేసి అందించాలని సూచన
మణికొండ, జూలై 3 (విజయక్రాంతి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నార్సింగి సర్కిల్-45 పరిధిలో సాగుతున్న ఎస్‌ఐఆర్ (SIR) ఓటరు సర్వే ప్రక్రియను తెలంగాణ ఎన్నికల సంఘం అదనపు సీఈఓ డాక్టర్ వాసం వెంకటేశ్వర్ రెడ్డి ఐఏఎస్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సర్కిల్ పరిధిలోని పోలింగ్ స్టేషన్ నెంబర్ 8, 10, 145లను సందర్శించి, బూత్ స్థాయి అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. ఈ కార్యక్రమం జూలై 24వ తేదీ వరకు నిరంతరాయంగా కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.
ఓటర్లు తమ ఓటు హక్కును కాపాడుకోవడానికి క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉన్న బీఎల్‌ఓల నుంచి ఎన్యూమరేషన్ ఫారాలు తీసుకుని, వాటిని పూర్తిగా నింపి సకాలంలో తిరిగి అందజేయాలని పిలుపునిచ్చారు. అధికారులు, ప్రజలు సమన్వయంతో ఈ ప్రక్రియను విజయవంతం చేయాలన్నారు. ఈ పర్యటనలో నార్సింగి డిప్యూటీ కమిషనర్ లక్ష్మారెడ్డి, ఏఎంసీ దేవేందర్, సూపర్వైజర్లు పాల్గొన్నారు.






