24 March, 2026 | 6:37 PM

నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఇటుక బట్టీలపై చర్యలు తీసుకోవాలి

24-03-2026 05:03 PM

ఈ ఇటుక బట్టీ తో ఇప్పటికే ఎంతోమంది మృత్యువాత పడ్డారు

ఎస్ఎస్బి ఇటుక బట్టీపై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదులో బోయినిపేట 6 వార్డు కౌన్సిలర్ శ్రీలత క్రాంతి

మంథని,(విజయక్రాంతి): మంథని-పెద్దపల్లి ప్రధాన రహదారిపై గంగాపురి- బొయిని పేట్ ప్రధాన రహదారి మద్యలో ఉన్న (ఎస్ ఎస్ బి) ఇటుక బట్టి యజమాని పై కఠిన చర్యలు తీసుకోవాలని మంథని, బోయిని పేటకు చెందిన 6వ  వార్డు కౌన్సిలర్ పోతరబోయిన శ్రీలత క్రాంతి మంగళవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష కు  ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు  మాట్లాడుతూ... ఇటుక బట్టీ యాజమాని నిబంధనలు పాటించడం లేదని, ఈ ఇటుక బట్టీ వలన అనేక అనర్ధాలు ప్రమాదాలు, మరణాలు జరుగుతున్నాయి.

ఈ ఇటుక బట్టికి కావాల్సిన బొగ్గును అనుమతి లేకుండా అక్రమంగా తీసుకువచ్చి ఇటుక బట్టీలో వాడుతున్నారని ఇన్ని సంవత్సరాలనుండి బొగ్గు కొనుగోలు ఎక్కడ చేస్తున్నాడని,  వాటి అనుమతి పత్రాలు ఉన్నాయా లేదా దయచేసి తనిఖీ చేయండని కోరారు.  అలాగే ఇటుక తయారీకి కావలసిన మట్టి ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారని,  వాటి వివరాలను కూడా పరిశీలించగలరు. ప్రధాన రహదారికి ఆనుకుని బట్టి ఉండడంతో వాయు కాలుష్యం ఏర్పడి వాటి నుంచి వచ్చే బూడిద రేణువులు కళ్ళల్లో పడి ఇప్పటికి వందల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు జరగడమే కాకుండా పదుల సంఖ్యలో మరణాలు కూడా సంభవించాయి.

ఈ ఇటుక బట్టి సమీపంలో ఉన్న వారి విద్యుత్ వైర్ల కారణంగా ఇటుక బట్టీలోకి వచ్చే లారీలతో విద్యుత్ ప్రమాదాలు జరిగి మరణించిన సంఘటనలు కూడా ఎన్నో  ఉన్నాయని,  అంతేకాకుండా  ఇటుక బట్టి వలన దుమ్ము, దూలి లేచి బోయిని పేట  ప్రజల  ఇళ్లల్లోకి వచ్చి, ఇంట్లో మంచి నీళ్ల ట్యాంక్లోకి, తినే ఆహార పదార్థాల్లోకి వెళ్లి అనారోగ్యానికి కారణం అవుతుందని అవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూమిని దర్జాగా కబ్జా చేసి నడిరోడ్డుపై సరైన ప్రమాణాలు నిబంధనలు పాటించకుండా యదేచ్ఛగా నిబంధనలకు విరుద్ధంగా ఇటుక బట్టి నిర్వహిస్తున్నారని,  ఇటుక బట్టీలో ఇతర రాష్ట్రాల  నుండి కూలీలను పనిచేయడానికి తీసుకవచ్చి కార్మికులకు కార్మిక చట్టాలను అమలు చేయకుండా, వారికి కనీస వసతులు కూడా ఏర్పాటు చేయలేదు.

కార్మికుల పిల్లలకు పాఠశాల, కనీస వైద్య సదుపాయాలు లేవని,  పూర్తిస్థాయిలో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ఇటుక బట్టి పై చర్యలు తీసుకోవాలని, ప్రమాదాలు జరగకుండా ప్రజల ప్రాణాలను కాపాడాలని, కార్మికులకు భద్రత కల్పించాలని కోరారు. రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు గంగాపురి నుండి బొయిన్ పెట్ కు ఇటివల బొక్కలవాగు మీదుగా ప్రభుత్వం భారి బ్రిడ్జి మంజూరు చేసిందని, ఈ ఇటుక బట్టి వలన బ్రిడ్జి పనులకు ఆటంకాలు కలగడమే కాకుండా ప్రమాదాలు జరిగే అవకాశాలు చాల ఉన్నాయని, వీటన్నిటిని పరిగణంలోకి తీసుకొని ఎంతో మంది మరణాలకు కారణమైన  ఈ ఇటుక బట్టి పర్మిషన్ తక్షణమే రద్దు చేసి అక్కడి నుండి తొలగించవలసిందిగా కలెక్టర్ ను  బొయిన్ పెట్ ప్రజల తరుపున వేడుకుంటున్నామనివారు తెలిపారు.