21 June, 2026 | 1:30 AM

స్వయంపాలన పోరు కెరటం

21-06-2026 12:00 AM

నేడు ఆచార్య జయశంకర్ సార్ వర్ధంతి :

తెలంగాణ ఉద్యమ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన మహనీయుడు, తెలంగాణ సిద్ధాంతకర్త, తెలంగాణ ప్రజల ఆత్మ ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్. తెలంగాణ రాష్ట్ర సాధనే తన జీవిత లక్ష్యంగా యావత్ కాలాన్ని ఉద్యమంలో గడిపిన ఆయన వరంగల్ జిల్లాలోని అక్కంపేటలో 1934 ఆగస్టు 6న మహాలక్ష్మి, లక్ష్మీకాంతరావు దంపతులకు జన్మించారు. హనుమకొండ, వరంగల్‌లో ప్రాథమిక, ఉన్నత విద్య అభ్యసించి, బెనారస్, అలీగఢ్ విశ్వవిద్యాలయాల్లో పీజీ కోర్సులు పూర్తిచేశారు.

ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్‌డీ పూర్తిచేశారు. బీఈడీ చదివారు. తెలుగుతోపాటు ఇంగ్లిష్, ఉర్దూ, హిందీ భాషల్లో పట్టు సాధించారు. జయశంకర్ సార్ చిన్ననాటి నుంచే తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న వివక్షను గమనించారు. ఇంటర్మీడియట్‌లోనే తెలంగాణ ఏర్పాటు చేయాలంటూ నినదించారు. 1952లో జరిగిన ముల్కీ ఉద్యమం నుంచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన వరకు ఆయన తన ఆలోచనలతో, రచనలతో, ఉపన్యాసాలతో ప్రజలను చైతన్యపరిచారు.

తెలంగాణ వెనుకబాటుతనానికి గల కారణాలను శాస్త్రీయంగా విశ్లేషించి దేశవ్యాప్తంగా తెలంగాణ వాదాన్ని బలంగా వినిపించారు. తెలంగాణ ప్రజల హక్కులు, ఆత్మగౌరవం, స్వయం పాలన కోసం జీవితాంతం పోరాటం చేశారు. అధ్యాపకులుగా సీకేఎం కళాశాలలో చేరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే వచ్చే అనేక ప్రయోజనాలను విద్యార్థులకు నూరిపోసి చైతన్య దీపం వెలిగించారు. విశాలాంధ్రకు వ్యతిరేకంగా లాఠీదెబ్బలు తిన్నారు.

1954లోనే విద్యార్థి నేతగా తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల విలీనానికి వ్యతిరేకంగా ‘ఫజల్ ఆలీ’ కమిషన్‌కు నివేదిక సమర్పించిన ధీశాలి. 1975--79 వరకూ సీకేఎం కళాశాలకు ప్రిన్సిపాల్‌గా, 1979--81 వరకూ కాకతీయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌గా, 1982-91 వరకూ సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ రిజిస్ట్రార్‌గా, 1991-94 వరకూ కాకతీయ వర్సిటీ వైస్ ఛాన్స్‌లర్‌గా పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నారు.

1999--2000 మధ్యకాలంలో అమెరికాలో పర్యటించి, తెలుగువారి సభల్లో పాల్గొని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, ఉద్యమ ఆవశ్యకతను తెలిపి, రాష్ట్ర ఏర్పాటుకు మంచి వాతావరణాన్ని నెలకొల్పారు. తెలంగాణ రాష్ట్రం ఒక డిమాం డ్, తెలంగాణలో ఏమి జరుగుతుంది, వక్రీకరణలు--వాస్తవాలు, తల్లడిల్లుతున్న తెలంగాణ (వ్యాస సంపుటి), తెలంగాణ (ఇంగ్లిష్) రచనలు చేశారు. తెలంగాణ ఐక్య వేదిక వ్యవస్థాపకుడిగానూ పనిచేశారు.

1969లో జరిగిన పొరపాట్లను మళ్లీ చేయొద్దని ఆచార్యులు, విద్యార్థులు, జర్నలిస్టులు తదితరులతో ఒక టీం ఏర్పాటు చేసి, తెలంగాణ సాధనకు వ్యూహాలు రచింపజేసిన మేధావి జయశంకర్ సార్. 1996 మలిదశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి ‘తెలంగాణ జనసభ’ ఏర్పాటులో కృషిచేశారు. తెలంగాణ ఆవశ్యకత గురించి అనేక రచనలను, ఎన్నో డాక్యుమెంట్లను రూపొందించి ప్రచురించారు. చిన్నతనం నుంచి తెలంగాణకు జరుగుతున్న అన్యాయం, అసమానతలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

కాకతీయ, ఉస్మానియా విశ్వవిద్యాలయాల్లో ‘తెలంగాణ రావాలి.. మా తెలంగాణ మాకు కావాలి’ అని నినదించే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దడంలో మేధావులు, ఆచార్యులు బియ్యాల జనార్దన్‌రావు, పి.ఎల్, విశ్వేశ్వర్‌రావు, కేశవరావు జాదవ్, కుసుంభ సీతారామారావు, కూరపాటి వెంకట నారాయణ, తుమ్మల పాపిరెడ్డి, లింగమూర్తి, తౌటం శ్రీనివాస్, ఇంకా విద్యార్థులు సంగని మల్లేశ్వర్, మారేడుగొండ బ్రహ్మం, మారోజు వీరన్న, కాశీం, మధుకర్, సుదర్శన్, వెంకటేశ్వర్లు, కరుణాకర్, మహేందర్, జర్నలిస్టులు పి.కొండల్, జగన్ మహేందర్, నారాయణ రెడ్డి, సుధాకర్ లాంటి ఇంకా ఎందరో ఆచార్యులు, విద్యార్థులు, జర్నలిస్టులు నడుం కట్టారు.

నిర్బంధంలో ‘స్వయంపాలనలో శాసిస్తాం... కానీ, ప్రస్తుతం ఇతరుల పాలనలో యాచిస్తున్నాం’ అని వరంగల్, భువనగిరి, సూర్యాపేట సభల ఏర్పాటులో మార్గదర్శిగా నిలిచారు. ఈ క్రమంలో ఎందరో విద్యార్థులు నేలకొరిగారు. 2001లో కేసీఆర్ సారథ్యంలో ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర సమితికి దిక్సూచిగా పనిచేసి ఉద్యమం నీరుకారకుండా చూశారు. ఒడుదొడుకులను ఎదుర్కొంటూ, ప్రత్యక్షంగా ఎన్నో అవమానాలకు గురై ఉద్యమ ఆకాంక్షల కోసం 2009లో కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం చేసిన చారిత్రక నిరాహార దీక్షకు మద్దతు తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అవిశ్రాంత కృషి చేసి, తాను కలలు కన్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చూడకుండానే, 2011 జూన్ 21న కన్నుమూశారు. ఆయన ఆశయాలు, దిశానిర్దేశనంతో కేసీఆర్ ఆధ్వర్యంలో ఉద్యమకారు లు, ప్రజానీకం సహకారంతో తెలంగాణ రాష్ట్రం సిద్ధించి, ప్రస్తుతం దేశంలో ఒక మార్గదర్శి రాష్ట్రంగా వ్యవసాయం, పారిశ్రామిక, సాఫ్ట్‌వేర్ రంగాల్లో ముందుకు సాగుతోంది. ఆయనపై గౌరవంతోనే కేసీఆర్ ఒక జిల్లాకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా అని పేరు పెట్టారు.

తెలంగాణ పునర్నిర్మాణంలో ప్రొఫెసర్ జయశంకర్ ఆశించిన తెలంగాణ.. ప్రజల గుండెచప్పుడు కావాలని ఆశిద్దాం. తెలంగాణ చరిత్రలో పోరాట యోధులు ఎవరిపేరు వారు లిఖించుకున్నా కానీ, మొదటి పుటపై యావత్ తెలంగాణలోని నాలుగు కోట్ల ప్రజలు ముక్తలేఖినితో సువర్ణాక్షరాలతో రాసిన పేరు జయశంకర్ సార్. జాతిపితగా ప్రజల గుండెల్లో ఆయన నిలిచిపోతారు. 

మలిదశ ఉద్యమంలో, తెలంగాణ సాధనలో అసువులు బాసిన 1300 మంది ఉద్యమకారుల కుటుంబాలను, ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొన్న ఉద్యమకారులను గత ప్రభుత్వం గుర్తించలేదు. ఎన్నికల్లో చెప్పినట్టుగానే ఉద్యమకారులను గుర్తించడానికి కేశవరావు ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వం ప్రత్యే క కమిటీ వేసింది.

నాడు ఫొటోలో అగుపడితే ఎన్‌కౌంటర్ అవుతామని వెనుక ఉండి 2001 వరకు ఉద్యమాన్ని బతికించిన ఉద్యమకారులను గుర్తించేది ఎట్లా? పేపర్ ప్రకటనలు, ఫొటోలు ప్రచురణ ప్రామాణికమైతే తెరవెనుక ఉండి ఉద్యమ జ్యోతికి ఊపిరి పోసిన నాయకులకు అన్యాయం జరిగే అవకాశం ఉంది. మలిదశ పోరాట యోధులకు గౌరవం దక్కే విధంగా కమిటీ సిఫారసులు చేసినప్పుడే తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ సార్‌కి ఘనమైన నివాళి అర్పించినట్టవుతుంది.

ప్రొ. సంగని మల్లేశ్వర్

 వ్యాసకర్త సెల్: 9866255355