మహిళా సాధికారతకు బలమైన పునాది
గ్రామైక్య సంఘ భవనాలకు భూమిపూజ
వెంకటాపూర్, మే 25 (విజయక్రాంతి): గ్రామీణ మహిళల సాధికారత, ఆర్థిక స్వావలంబన లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగా మండలంలోని 21 గ్రామైక్య సంఘ భవనాల నిర్మాణాలకు సోమవారం భూమిపూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఆయా గ్రామాల సర్పంచుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాలు ఘనంగా సాగాయి. మండల పరిధిలోని 32 గ్రామైక్య సంఘాలకు గాను తొలి విడతలో 21 సంఘాల భవనాలకు భూమిపూజలు చేపట్టారు.
మల్లయ్యపల్లి, అడవి రంగాపూర్, చక్రవర్తిపల్లి, లక్ష్మీదేవిపేట, నర్సింగాపూర్, నల్లగుంట, ఎల్లారెడ్డిపల్లి, పాలంపేట, రామంజాపూర్, నారాయణగిరిపల్లి, కేశవాపూర్, సింగరకుంటపల్లి, పాపయ్యపల్లి, ఇంచెంచెరువుపల్లి, జవహర్ నగర్ గ్రామాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామీణ మహిళలకు శాశ్వత వేదికగా ఈ భవనాలు ఉపయోగపడనున్నాయని అధికారులు తెలిపారు. మహిళా సంఘాల సమావేశాలు, పొదుపు కార్యక్రమాలు, బ్యాంకు లావాదేవీలు, ఉపాధి శిక్షణలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు ఈ భవనాలు కేంద్రాలుగా మారనున్నాయని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మహిళా సంఘ సభ్యులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. మహిళల ఆర్థికాభివృద్ధి, గ్రామాభివృద్ధిలో వారి పాత్ర మరింత బలపడేందుకు ఈ భవనాలు దోహదపడతాయని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, స్పెషల్ ఆఫీసర్, ఈజిసి ఏపిడి, ఏపిఎం, సీసీలు, వివోలు, సభ్యులు, వివోఏలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.






