నేను.. నా పల్లెటూరు..
యంగ్ హీరో సుమంత్ ప్రభాస్ నుంచి వస్తున్న రూరల్ లవ్, ఫ్యామిలీ డ్రామా మూవీ ‘గోదారి గట్టుపైన’. ఈ చిత్రాన్ని సుభాష్ చంద్ర దర్శకత్వంలో రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ నిర్మించింది. నిధి ప్రదీప్ కథానాయికగా నటిం చగా, జగపతిబాబు కీలక పాత్ర పోషించారు. రాజీవ్ కనకాల, లైలా, దేవిప్రసాద్, సుదర్శన్, రాజ్‌కుమార్ కసిరెడ్డి, వైవా రాఘవ్, రోహిత్ కృష్ణ వర్మ ఇతర ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ మంచి స్పందన దక్కించుకున్నాయి.
తాజాగా మేకర్స్ ఈ సినిమా నుంచి ‘నేను నా పల్లెటూరు’ అనే పాటను విడుదల చేశారు. ‘నేనూ నా పల్లెటూరు ఇంతే నా స్వర్గం.. అందం, ఆనందమే అనునిత్యం నా మార్గం.. పిలిచే రంగుల ముంగిళ్లు.. ఇరుకే తెలియని లోగిళ్లు.. వావి వరసల వంతెనగా.. మనసులు కలిపే సందళ్లు.. ఈ చోటి నెమ్మదీ.. ఏ చోటా లేనిదీ.. ఈ పచ్చిగాలి నిండార పీల్చే ప్రాణాల నిడివి వెయ్యేళ్లు.. ఈ గూటి గువ్వ ఆ యేటి కలువ.. ఈ మట్టి మనుషులే నావాళ్లు.. నా పల్లే...’ అంటూ సాగుతోందీ మెలోడీ. నాగవంశీకృష్ణ స్వరపరిచిన ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా, ఎంఎల్‌ఆర్ కార్తికేయ పాడారు. సాయి సంతోష్ డీవోపీ, ప్రవాల్య ప్రొడక్షన్ డిజైన్, అనిల్ కుమార్ పీ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్న ఈ సినిమా మే 8న రిలీజ్ కానుంది.






