ఆర్‌అండ్‌బీ అధికారుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి
మెదక్ మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్ రెడ్డి
పాపన్నపేట,ఆగస్టు17: ఆర్ అండ్ బీ అధికారుల నిర్లక్ష్యంతో పాపన్నపేట గ్రామపంచాయతీ కారోబార్ ఆకుల కృష్ణ ప్రాణం పోయిందని, దీనికి ప్రభుత్వం బాధ్యత వహించి కుటుంబాన్ని ఆదుకోవాలని మెదక్ మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్ రెడ్డి డిమాండ్ చేశారు. మండల కేంద్రం పాపన్నపేటకు చెందిన ఆకుల కృష్ణ ఇటీవల మండల పరిధిలోని యూసఫ్ పేట శివారులో రోడ్డు ప్రమాదంలో మరణించిగా సోమవారం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.
ఈ సందర్భంగా శశిధర్ రెడ్డి మాట్లాడుతూ.. మెదక్ నుండి పాపన్నపేట ప్రధాన రహదారి అక్కడక్కడ గుంతల మయమైందని, ఈ గుంతలతో ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. ఆకుల కృష్ణ ప్రమాదానికి రోడ్డు గుంతే ప్రధాన కారణమన్నారు. ఈ ప్రమాదానికి ప్రభుత్వం బాధ్యత వహించి కృష్ణ భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
పంచాయతీలో కారోబార్ గా కృష్ణ విధులు నిర్వహిస్తూ మరణించినందున పంచాయతీరాజ్ శాఖ లేదా ఆర్ అండ్ బీ శాఖలో కానీ ఉద్యోగం కల్పించాలన్నారు. వీరి వెంట బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా నాయకులు పోతేదార్ మల్లన్న, మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు మహిపాల్, మాజీ ఏడుపాయల డైరెక్టర్లు కిషన్ రెడ్డి, సుంకరి కృష్ణ, కుమ్మరి పోచయ్య, నాయకులు బాల్ రాజ్, రంగంపేట శ్రీనివాస్, టప్ప రాములున్నారు.






