ప్రజావాణి తొలిరోజే అధికారుల డుమ్మా..
22 మంది అధికారులకు 8 మంది మాత్రమే హాజరు
నాగల్గిద్ద, ఆగస్టు 17 : నాగల్గిద్ద మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు నిర్వహించిన కార్యక్రమానికి మొత్తం 22 మంది అధికారులు హాజరు కావాల్సి ఉండగా, కేవలం 8 మంది మాత్రమే హాజరయ్యారు. మిగతా 14 మంది అధికారులు గైర్హాజరయ్యారు. ప్రజావాణిలో మొత్తం 6 దరఖాస్తులు అందినట్లు ఎంపీడీవో మహేశ్వరరావు తెలిపారు.
వివిధ సమస్యల పరిష్కారం కోసం వచ్చిన ప్రజలు సంబంధిత అధికారులను కలుసుకోలేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గైర్హాజరైన అధికారులు ఏ కారణంతో హాజరు కాలేదో ఉన్నతాధికారులు పరిశీలించి, అనుమతి లేకుండా గైర్హాజరైనట్లయితే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరారు.ఇదిలా ఉండగా ఇరక్పల్లి కూబా నాయక్తండాకు చెందిన జాదవ్ లక్ష్మణ్ భూ వివాదంపై ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.
తన స్థలంలో నిర్మాణ పనులు చేపడుతున్నారని ఆరోపిస్తూ, స్థల హక్కులు, సరిహద్దులను పరిశీలించి క్షేత్రస్థాయిలో విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు.మరోవైపు నాగల్గిద్ద జడ్పీ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న సిద్ధారెడ్డి ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా ఇన్చార్జి సైన్స్ అధికారిగా సంగారెడ్డిలో విధులు నిర్వహిస్తున్నందున, ఆయన స్థానంలో వెంటనే రెగ్యులర్ ప్రధానోపాధ్యాయుడిని నియమించాలని కేవీపీఎస్ జిల్లా నాయకుడు గణపతి ప్రజావాణిలో వినతిపత్రం సమర్పించారు. హెచ్‌ఎం పాఠశాలలో అందుబాటులో లేకపోవడంతో పాఠశాల నిర్వహణతో పాటు కాంప్లెక్స్ పరిధిలోని పాఠశాలల పర్యవేక్షణ సక్రమంగా జరగడం లేదని తెలిపారు.






