అభివృద్ధి సంక్షేమానికి సమాన ప్రాతినిధ్యం ఇస్తున్న ప్రజా ప్రభుత్వం
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
మహబూబాబాద్, ఆగస్టు 16 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రజల ఆకాంక్షల మేరకు ముందుకు సాగుతోందని, సంక్షేమం అభివృద్ధికి సమాన ప్రాతినిత్యం కల్పిస్తోందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.పరకాలలో ఆదివారం నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి బాట విజయోత్సవ సభలో మంత్రి మాట్లాడుతూ ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి ఎ. రేవంత్రెడ్డి నాయకత్వంలో పేదల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు అమలు చేస్తూనే అభివృద్ధి పనులను వేగంగా చేపడుతోందన్నారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు సవాళ్లతో ఉన్నప్పటికీ పేదల సంక్షేమాన్ని ఎక్కడా విస్మరించకుండా అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. పరకాల నియోజక వర్గంలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా రూ.400 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయడం ప్రభుత్వ అభివృద్ధి సంకల్పానికి నిదర్శనమన్నారు. దశాబ్దాలుగా వరంగల్ ప్రజలు కోరుకుంటున్న మామునూరు విమానాశ్రయాన్ని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రత్యేక చొరవతో సాకారం చేస్తున్నామని మంత్రి తెలిపారు.
భూసేకరణ కోసం రూ.300 కోట్లకు పైగా ఖర్చు చేసి చర్యలు చేపట్టామని, రాబోయే రెండేళ్లలో మామునూరు విమానాశ్రయాన్ని పూర్తి చేసి విమాన సర్వీసులు ప్రారంభించే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. వరంగల్ నగర భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని సుమారు రూ.5,700 కోట్లతో అండర్గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయనున్నామని మంత్రి చెప్పారు. హైదరాబాద్కు దీటుగా వరంగల్ను ఆధునిక మౌలిక వసతులతో అభివృద్ధి చేయాలన్నదే ముఖ్యమంత్రి లక్ష్యమన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా రైతాంగానికి కీలకమైన దేవాదుల ప్రాజెక్టును పూర్తి చేయాలని ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. సుమారు రూ.6,000 కోట్లకు పైగా వ్యయంతో కొనసాగుతున్న దేవాదుల ప్రాజెక్టును ప్రజా ప్రభుత్వ హయాంలో పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తామని మంత్రి స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి ప్రతీకగా నిలిచిన ప్రొఫెసర్ జయశంకర్ గ్రామాన్ని రెవెన్యూ గ్రామంగా ఏర్పాటు చేశామని, ఆ గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు.
పరకాల నియోజకవర్గ అభివృద్ధి కోసం స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి చేస్తున్న కృషికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రజాప్రతినిధుల అభ్యర్థనలకు సానుకూలంగా స్పందిస్తూ అభివృద్ధి పనులకు అవసరమైన నిధులు మంజూరు చేస్తున్నారని మంత్రి తెలిపారు. వరంగల్ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి స్పష్టం చేశారు.
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి మాట్లాడుతూ పరకాల ప్రాంతానికి గొప్ప చరిత్ర, పోరాట స్ఫూర్తి ఉందన్నారు. స్వాతంత్య్ర ఉద్యమ కాలంలో భూమికి ,భుక్తికి పరకాల ప్రాంత ప్రజలు చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందని తెలిపారు. 1947 సెప్టెంబర్ 2న స్వాతంత్య్ర ఉద్యమకారులపై జరిపిన దాడిలో 25 మంది స్వాతంత్య్ర సమరయోధులు అమరులయ్యారని, వారి త్యాగాలను పరకాల ప్రజలు ఎన్నటికీ మరువలేరని పేర్కొన్నారు.
స్వాతంత్య్ర ఉద్యమ చరిత్రకు ప్రతీకగా నిలిచేలా మాజీ గవర్నర్, మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ శాసనసభ్యులు జయన్మనేని విజయసంఘరావు గారి ప్రత్యేక కృషితో, ఆయన సతీమణి చంద్రమ్మ పేరుతో 2003లో అమరధామం నిర్మించారని గుర్తు చేశారు. పరకాల అమరధామాన్ని మరింత అభివృద్ధి చేసి, పర్యాటక ప్యాకేజీలో భాగంగా చేర్చి ప్రత్యేక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.
అమరుల త్యాగాలు, పరకాల చారిత్రక పోరాటాలను భవిష్యత్ తరాలకు తెలియజేసేలా అమరధామాన్ని అభివృద్ధి చేయాలని కోరారు. పరకాల గతంలో తాలూకా కేంద్రంగా ఉన్నప్పటికీ, కాలక్రమంలో పరిపాలనా హోదాల్లో వచ్చిన మార్పుల కారణంగా ప్రాంత అభివృద్ధిపై ప్రభావం పడిందని ఎమ్మెల్యే తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి దృష్టికి సమస్యను తీసుకెళ్లగా, ముఖ్యమంత్రి వెంటనే స్పందించి రూ.11.60 కోట్లు విడుదల చేయడంతో పనులు తిరిగి ప్రారంభమయ్యాయని తెలిపారు.
నేడు అదే 100 పడకల ఆసుపత్రి పనులను పూర్తి చేసి ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం పరకాల ప్రజలకు గర్వకారణమ న్నారు. మహిళల ఆర్థిక సాధికారతకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇస్తున్న ప్రాధాన్యానికి అనుగుణంగా పరకాల నియోజకవర్గంలో హింద్రా డెయిరీ ఏర్పాటు ఆలోచనను 2024 డిసెంబర్ నుంచే ముందుకు తీసుకెళ్లినట్లు ఎమ్మెల్యే తెలిపారు. నేడు ముఖ్య మంత్రి చేతుల మీదుగా హింద్రా డెయిరీకి శంకుస్థాపన జరగడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.
ప్రస్తుతం సుమారు 2,000 మంది సభ్యులతో ప్రారంభమవుతున్న ఈ కార్యక్రమాన్ని రాబోయే రోజుల్లో విస్తరించి 40,000 కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చేలా కృషి చేస్తానని తెలిపారు. ముఖ్య మంత్రి నిర్దేశించిన మహిళా ఆర్థిక సాధికారత లక్ష్యాన్ని పరకాల నియోజకవర్గంలో విజయవంతం చేయడానికి తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి స్పష్టం చేశారు.పరకాల సమగ్ర అభివృద్ధికి నిరంతరం సహకరిస్తున్న ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డికి ఎమ్మెల్యే ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.






