బొంరాస్‌పేట్ భూములపై పెద్దల కన్ను
- నాడు బీఆర్‌ఎస్ నేతల యత్నం
- కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సీన్ రివర్స్
- నలిగిపోతున్న అధికారులు
మేడ్చల్, ఆగస్టు 16(విజయ క్రాంతి): మేడ్చల్ జిల్లా శామీర్ పేట్ మండలంలోని బొంరాస్ పేట్ శివారులోని భూములపై పెద్దల కన్ను పడింది. అధికారంలో ఉన్న సమయంలో బి ఆర్ ఎస్ నాయకులు ఈ భూములను కాజేసేందుకు విశ్వ ప్రయత్నం చేయగా, ప్రస్తుతం కాంగ్రెస్ నాయకులు అదే ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని లొసుగులను ఆధారం చేసుకుని ప్రైవేట్ వ్యక్తులకు చెందిన భూములను సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
బొంరాస్ పేట్ శివారులో 323 నుంచి 409 వరకు సర్వే నెంబర్లలో 1049 ఎకరాల భూమి ఉంది. గతంలో 1960 ప్రాంతంలో గుడివాడ పార్లమెంటు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన దుగ్గిరాల బలరామకృష్ణయ్య తన కుటుంబ సభ్యులు, సన్నిహితులు 21 మంది పేరుమీద భూమి కొనుగోలు చేశారు. ఆ తర్వాత ఈ భూమి చేతులు మారింది. ఇందులో 17 మంది బొమ్రాస్పేట్ శివారులో తమ పేరిట భూమిలేదని డిక్లరేషన్ ఇచ్చారు. మిగిలిన నలుగురిలో సీలింగ్ సర్ ప్లస్ భూమిక గుర్తించి నిరుపేదలకు పంపిణీ చేశారు.
తెరమీదకు వారసులు
భూములు కొనుగోలు చేసిన వారు వ్యవసాయం చేస్తున్నారు. రింగ్ రోడ్డును ఆనుకొని ఉండడం, భూమి కోట్లలో ఉండడంతో హఠాత్తుగా వారసులు తెరమీదకు వచ్చారు. బీ ఆర్‌ఎస్ అధికారంలో ఉన్న సమయంలో వీరు ఆ పార్టీ పెద్దలను ఆశ్రయించారు. వారు రంగ ప్రవేశం చేసి అధికారులపై తీవ్ర ఒత్తిడి చేశారు. అప్పట్లో పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న రేవంత్ రెడ్డి బాధితులకు పూర్తి అభయం ఇచ్చారు. బి ఆర్ ఎస్ నాయకులు వారి అధికార పత్రిక నమస్తే తెలంగాణలో రైతులు కాదని, కబ్జాదారులని, పెట్టుబడిదారులని కథనాలు రాయించారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సీన్ రివర్స్
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీన్ రివర్స్ అయింది. కాంగ్రెస్ నాయకులు ఆ భూములపై కన్నేసి కబ్జాకు ప్రయత్నిస్తుండగా, టిఆర్‌ఎస్ నాయకులు భూ యజమానుల తరపున పోరాటం చేస్తున్నారు. ఇటీవల షామీర్పేట్ తహసిల్దార్ కార్యాలయం వద్ద రైతులు ధర్నా నిర్వహించగా బి ఆర్ ఎస్ నాయకులు మద్దతు పలికారు. పార్టీ తరపున రాష్ట్ర నాయకుడు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ హాజరయ్యారు. అప్పట్లో రైతులు కాదు కబ్జాదారులని పెట్టుబడుదారులని కథనం రాసిన నమస్తే తెలంగాణ దినపత్రికలో బొంరాస్ పేట్ భూ హారతి అంటూ కథనం రాయడం గమనార్హం.
నలిగిపోతున్న అధికారులు
బొంరాస్పేట్ భూముల విషయంలో అధికారులు నలిగిపోతున్నారు. కాంగ్రెస్ పెద్దలు తమకు అనుకూలంగా పనిచేయాలని ఒత్తిడి చేస్తున్నారు. రైతులు అధికారులపై ఆరోపణలు చేస్తున్నారు. తమ పిటిషన్లు తీసుకోవడం లేదని, కోర్టు ఆదేశాలు పాటించడం లేదని అంటున్నారు.






