నా ప్రాణం నీవే..
తమిళ, తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్న హీరో శ్రీరామ్ నటిస్తున్న కొత్త సినిమా ‘ది మేజ్’. ఈ చిత్రంలో ప్రియాంక, హృతిక శ్రీనివాస్, కమల్ కామరాజు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. శ్రౌష కమల ఆర్ట్స్, యూఆర్ క్రియేషన్స్ బ్యానర్లపై డాక్టర్ ఉదయ్ కే రెడ్డి పాల్వాయి, డాక్టర్ కరెడ్డి శ్రీధర్‌రెడ్డి, డాక్టర్ భరత్‌రెడ్డి గోపు, డాక్టర్ అనిరుధ్‌రెడ్డి సోమ నిర్మిస్తున్నారు. సైకలాజికల్ థ్రిల్లర్ కథతో ఈ చిత్రాన్ని దర్శకుడు డాక్టర్ రవికిరణ్ గడలాయ్ రూపొందిస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. తాజాగా ఈ చిత్రం నుంచి హీరో ఆనంద్ దేవరకొండ ఫస్ట్ సింగిల్ ‘నన్నే నన్నే..’ రిలీజ్ చేశారు. ‘నా ప్రాణం నీవే.. నా ధ్యానం నీవే.. నా మౌన గానం ఇకపై నీవే.. నా స్నేహం నీవే.. నా మోహం నీవే.. నా తీరని దాహం ఇకపై నీవే.. నా లోకం నీవై మనసిచ్చావే.. మాలోకం గాన్నే మహ మెచ్చావే.. నా గుడి దేవతవై ఒకటయ్యావే.. ఏడడుగుల ప్రేమే ప్రకటించావే.. నన్నే నన్నే మనిషిగా గుర్తించావే.. నన్నే నన్నే మార్చేశావే.. మన్ను, మిన్ను కలిపేలా పైవాడే.. నన్నూ నిన్నూ కలిపాడే..’ అంటూ సాగుతోందీ గీతం. శ్రవణ్ భరద్వాజ్ స్వరపర్చిన ఈ పాటను విజయ్‌కుమార్ రాయగా, కపిల్ కపిలన్ పాడారు. ఈ చిత్రానికి డీవోపీ: శివకృష్ణ; ఎడిటర్: సత్య గిడుతూరి.






