4 July, 2026 | 2:00 AM

ట్రంప్‌కు న్యాయ పరీక్ష!

04-07-2026 12:00 AM

అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు వరుసగా న్యాయ, రాజ్యాంగ పరీక్షలను ఎదుర్కొంటున్నాయి. అమెరికా ఫస్ట్ పేరిట ఆయన అనుసరిస్తున్న కఠిన విధానాలు రాజకీయంగా తన మద్దతుదారులను ఆకట్టుకుంటున్నప్పటికీ, చట్టప రంగా మాత్రం ఆటంకాలు తప్పడం లేదు. ఇరాన్‌పై సైనిక చర్యతో దుందుడుకుగా వ్యవహరించిన ట్రంప్ సర్కార్‌కు ఇటీవల అమెరికా చట్టసభ కళ్లెం వేసిన విషయం విదితమే.

అంతకుముందు ప్రపంచ దేశాలపై ఏకపక్షంగా విధిస్తున్న సుంకాలకు న్యాయస్థానం అడ్డుకట్ట వేసింది. ఇప్పుడు జన్మతః పౌరసత్వాన్ని పరిమితం చేయాలన్న నిర్ణయాన్ని కోర్టు నిలిపివేయడం ట్రంప్ ప్రభుత్వానికి పెద్ద దెబ్బేనని చెప్పాలి. అగ్రరాజ్యం 250వ స్వాతంత్య్ర దినోవత్సం వేళ వలసదారులకు, ముఖ్యంగా అమెరికాలో జీవిస్తున్న లక్షల మంది భారతీయులకు ఈ తీర్పు ఊరట కలిగించింది. వాస్తవానికి, అమెరికా అంటే నే వలసల రాజ్యం.

అదొక మినీ వరల్డ్. జాతులు, మతాలు, భాషలు, ప్రాంతాలకతీతంగా ఎందరో చిందించిన స్వేదంతో రూపుదిద్దుకున్న దేశమది. అందుకే అమెరికా పౌరులతోపాటు ఆ దేశ నిర్మాణానికి తోడ్పడేవారికి అక్కడి రాజ్యాంగం ఎన్నో హక్కులను కల్పించింది. సివిల్ వార్, బానిసత్వం రద్దు తర్వాత 1868లో 14వ సవరణ ద్వారా రాజ్యాంగం ప్రసాదించిన అత్యంత కీలకమైన హక్కు జన్మతః పౌరసత్వం. దీని ప్రకారం అమెరికాలో జన్మించిన ప్రతి వ్యక్తి తన తల్లిదండ్రులతో సంబంధం లేకుండా అమెరికా పౌరసత్వాన్ని పొందుతాడు.

అయితే, అక్రమంగా అమెరికాలోకి ప్రవేశిస్తున్న వలసదారులు ఈ నిబంధనను దుర్వినియోగం చేసి పౌరసత్వం పొందుతున్నారని ట్రంప్ ప్రభుత్వం మొదటినుంచీ వాదిస్తున్నది. ఈ క్రమంలోనే తల్లిదండ్రుల్లో కనీసం ఒకరు అమెరికా పౌరుడు లేదా శాశ్వత నివాస హక్కు కలిగి ఉంటేనే జన్మతః పౌరసత్వం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నది.

దీంతో రాజ్యాంగం ప్రసాదించిన హక్కును అధ్యక్షుడు మార్చలేరంటూ పలు రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయ స్థానాన్ని ఆశ్రయించగా తాజా తీర్పు వెలువడటం ముదావహం. ట్రంప్ సర్కార్ అనుసరిస్తున్న వలసల వ్యతిరేక విధానానికి ఈ తీర్పుతో ముకుతాడు వేసినట్టయ్యింది.

ఈ అంశాన్ని తన ప్రధాన రాజకీయ అజెండాగా ముందుకు తీసుకెళ్తున్న ట్రంప్ ప్రభుత్వం న్యాయపరమైన చిక్కుల నుంచి తప్పించుకోలేకపోతున్నది. తాను తీసుకుంటున్న ప్రతి నిర్ణయం తిరగబడుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ఇకనైనా రాజ్యాంగ వ్యవస్థలతో కలిసి నడుస్తారా, లేదా కలబడతారా? అన్నది చూడాలి.