‘హిల్ట్’ అమలుకు కీలక అడుగు!
- మార్గదర్శకాలు విడుదల చేసిన పరిశ్రమలు, వాణిజ్య శాఖ
- కాలుష్య కారక కంపెనీల నుంచి దరఖాస్తుల స్వీకరణకు ప్రత్యేక ఆన్‌లైన్ పోర్టల్
- వెబ్‌సైట్‌ను ప్రారంభించిన మంత్రి శ్రీధర్‌బాబు
- దరఖాస్తు గడువు జూన్ 30
హైదరాబాద్, మే 22 (విజయక్రాంతి) : హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని కాలుష్య కారక పరిశ్రమలను నగరం నుంచి తరలించి పునరావాసం కల్పించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన హైదరాబాద్ ఇండస్ట్రియల్ లాండ్స్ ట్రాన్స్‌ఫర్మేషన్ పాలసీ (హిల్ట్) అమలుకు కీలక అడుగు పడింది. ఈ పాలసీ అమలుకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేస్తూ పరిశ్రమలు, వాణిజ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
హిల్ట్ పాలసీ కింద లబ్ధి పొందాలనుకునే అర్హత గల పరిశ్రమల నుంచి దరఖాస్తులను స్వీకరించడానికి రూపొందించిన ఆన్‌లైన్ పోర్టల్‌ను ఐటీ, పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు శనివారం ప్రారంభించారు. గతంలో జీవో నం. 27 ద్వారా ప్రకటించిన హిల్ట్ పాలసీ కింద హైదరాబాద్ కోర్ సిటీ పరిధిలోని 21 ఇండస్ట్రియల్ పార్కులు, స్వతంత్ర పరిశ్రమల్లో ఉన్న కాలుష్యకారక కంపెనీలకు పునరావాసం కల్పించేందుకు ప్రత్యేకంగా కార్యాచరణ రూపొందించారు.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్-కమిటీ సిఫారసుల ఆధారంగా పరిశ్రమల యాజమాన్యాలకు కొన్ని కీలక వెసులుబాట్లను ప్రభుత్వం ఆమోదించింది. 10 శాతం డెవలప్‌మెంట్ ఇంపాక్ట్ ఫీజును ముందస్తుగా చెల్లించే విధానాన్ని ప్రవేశపెట్టారు.
సకాలంలో దరఖాస్తులు సమర్పిస్తేనే ప్రస్తుత రేట్లు పరిగణలోకి..
ఆయా పరిశ్రమల యజమానులు దరఖాస్తు చేసుకోవడాఇకి ప్రభుత్వం జూన్ 30 లోపు గడువు విధించింది. సకాలంలో దరఖాస్తులు సమర్పించే వారికి ప్రస్తుత ఎస్‌ఆర్‌వో మార్కెట్ రేట్లను పరిగణనలోకి తీసుకుంటారు. కొత్తగా అందుబాటులోకి వచ్చిన డిజిటల్ పోర్టల్ ద్వారా పరిశ్రమల యూనిట్ హోల్డర్లు తమ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో సమర్పించడమే కాకుండా, వాటిని పర్యవేక్షించడం, ట్రాక్ చేసుకునే సదుపాయం కల్పించారు. ఇది ప్రభుత్వ పారదర్శక, సాంకేతిక ఆధారిత పరిపాలన, ప్రజాకేంద్రిత సేవల పట్ల ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని అధికారులు అంటున్నారు.
దరఖాస్తు వెబ్‌సైట్..
దరఖాస్తులను tgiic.tealangan a.gov.in వెబ్‌సైట్ ద్వారా సమర్పించవచ్చు. దరఖాస్తు సమయంలో దరఖా స్తుదారులు, శాఖ అధికారులకు సహా యం అందించేందుకు ప్రత్యేక సహాయక వ్యవస్థను ఏర్పాటు చేశారు. భాగస్వాములు తమ సందేహాలను నిర్మిత టికెటింగ్ వ్యవస్థ ద్వారా నమో దు చేయవచ్చు. ఈ కార్యక్రమంలో టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మల జగ్గారెడ్డి, తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అధికారులు, చర్లప ల్లి, కుషాయిగూడ, నాచారం, బాలానగర్ ఇండస్ట్రియల్ ఏరియాలకు చెందిన ఐఏఎల్‌ఏ ప్రతినిధులు పాల్గొన్నారు.






