1 June, 2026 | 2:04 AM

సింగరేణిలో ‘కోటి’ వెలుగులు

01-06-2026 01:13 AM
  1.   45 కుటుంబాలకు ఇప్పటికే రూ.41కోట్ల బీమా చెల్లింపు
  2. కార్మిక కుటుంబాలకు 1.25 కోట్ల ఇన్సూరెన్స్
  3. పాక్షిక, శాశ్వత వైకల్యానికి కూడా వర్తింపు

హైదరాబాద్, మే 31 (విజయక్రాంతి): సింగరేణిలో కోటి రూపాయల ప్రమాద బీమా కార్మికుల కుటుంబాల్లో కోటి వెలుగులు నింపుతోంది. ఇప్పటికే దాదాపు 45 కుటుంబాలకు రూ.41కోట్ల బీమా సొమ్మును చెల్లించి, వారికి ఆర్థిక భరోసా కల్పించింది. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమం.. సింగరేణిలోనే కాదు దేశ వ్యాప్తంగా లక్షలాది కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నది.

ప్రమాదాల వల్ల కుటుంబ పెద్దను కోల్పోయి ఆర్థికంగా కుంగిపోయి ఛిన్నాభిన్నం అయ్యే పరిస్థితుల్లో చిక్కుకున్న జీవితాలకు ఉచిత ప్రమాద బీమా పథకం భరోసాగా నిలుస్తోంది. దీంతో సంక్షేమంలో సింగరేణి సరికొత్త అధ్యాయం లిఖిస్తోంది. కార్మిక సంక్షేమానికి పెద్ద పీట వేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు సింగరేణి యాజమాన్యం దేశంలో తొలిసారిగా రూ.1.25 కోట్ల ప్రమాద బీమా పథకాన్ని సింగరేణి సంస్థలో అమలు చేసింది.

2024లో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేతుల మీదుగా ప్రారంభమైన ఈ పథకం ఇప్పుడు దేశవ్యాప్తంగా బీమా రంగంలో ఒక విప్లవాత్మక చర్యగా మారింది. బొగ్గు కంపెనీలతోపాటు, ఇతర సంస్థలు కూడా ఈ ప్రమాద బీమా పథకాన్ని అమలు చేయడానికి సింగరేణి సంస్థ స్ఫూర్తిగా నిలిచింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశంతో సింగరేణి సంస్థ తీసుకున్న ప్రత్యేక చొరవ వల్ల సింగరేణి ఉద్యోగులు తమ శాలరీ ఖాతాలు కలిగి ఉన్న పలు బ్యాంకుల వారు ఈ ప్రమాద బీమా పథకాన్ని అమలు చేస్తున్నారు.

సింగరేణి ఉద్యోగులు కార్పొరేట్ శాలరీ అకౌంట్స్ కలిగి ఉన్న బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు ప్రమాద బీమా పథకం కింద రూ.1.25 కోట్ల చెల్లించడానికి సింగరేణితో ఒప్పందం చేసుకొని, పాటిస్తున్నాయి. సింగరేణి సంస్థలో పనిచేస్తున్న 40,275 మంది ఉద్యోగులకు సింగరేణి ప్రాంతంలో బ్రాంచీలు కలిగి ఉన్న వివిధ బ్యాంకుల ద్వారా యాజమాన్యం నెలనెలా జీతాలు చెల్లిస్తోంది.

సింగరేణి ఉద్యోగు లు వ్యక్తిగతంగా పలు ప్రమాద బీమా పథకాలలో సభ్యులుగా ఉన్నప్పటికీ ఆ పథకాల కింద నిబంధనల ప్రకారం కొంత సొమ్మును ఇన్సూరెన్స్ కింద చెల్లిస్తున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో సింగరేణిలో పలు బ్యాంకులు అమలు చేస్తున్న ప్రమాద బీమాకు ఎవరూ ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. 

బాధిత కుటుంబాలకు ఆర్థిక భరోసా

సింగరేణి ఉద్యోగులు ఎవరైనా అనుకోని ప్రమాదాలలో మృతి చెందినప్పుడు ప్రమాద బీమా పథకం కింద అతని కుటుంబ సభ్యులకు రూ.కోటి నుంచి రూ.1.25 కోట్ల వరకు అందజేయడంతో వారికి ఆర్థికంగా ఎంతో ఊరట లభిస్తుంది. ఈ ఉచిత ప్రమాద బీమా పథకం కింద రెండేళ్ల కాలంలో సింగరేణిలో వివిధ ప్రమాదాల్లో కొందరు ఉద్యోగులు మృతిచెందారు. దీంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 32 మంది బాధిత కుటుంబాలకు సుమారు రూ.28కోట్లు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 13 మందికి సుమారు రూ.13 కోట్లు చెల్లించింది.

ఇటీవల శ్రీరాంపూర్ ఏరియాలో కార్మికుడు సత్యనారాయణ గని ప్రమాదంలో రెండు కాళ్లు కోల్పోగా అతని కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంది. ఈ సమయంలో బ్యాంకు వారు ప్రమాద బీమాపథకం కింద ఆ కార్మిక కుటుంబానికి కోటి రూపాయలను అందజేశారు. ప్రమాద బీమాతోపాటు, సహజ మరణానికి కూడా రూ.10 లక్షల ఉచిత బీమా పథకాన్ని అమలు చేయడానికి ఎస్‌బీఐ, యూబీఐ, ఐఓబీ, పీఎన్‌బీ బ్యాంకులు సింగరేణితో ఒప్పందం చేసు కున్నాయి.

బీఓబీ గరిష్టంగా రూ.15 లక్షల సహజ బీమాఅందిస్తోంది. సింగరేణిలో మొదలైన ఈ పథకాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఆదేశాల మేరకు మొదటగా రాష్ట్రంలోని అన్ని విద్యుత్ సంస్థల్లో అమలు చేశారు. అనంతరం అన్ని ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగులకు వర్తింపజేశారు. ఈ పథకానికి అనుబంధంగా ఎస్‌బీఐ సహకారంతో కార్పొరేట్ శాలరీ ఖాతా కలిగిన ఉద్యోగులకు నామ మాత్రపు ప్రీమియంతో రూ.50 లక్షల ఆరోగ్య బీమా అమలు చేస్తోంది.

ఇందులో ఉద్యోగి, అతడి జీవిత భాగస్వామి, 25 ఏళ్ల లోపు ఇద్దరు పిల్లలకు ఏడాదికి రూ.8,906 ప్రీమియంతో 50 లక్షల ఆరోగ్య బీమా వర్తిస్తుంది. సింగరేణిలో దాదాపు 30 వేల మంది పొరుగు సేవల సిబ్బంది పనిచేస్తున్నారు. వీరి సంక్షేమం విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఫలితంగా హెచ్‌డీఎఫ్‌సీ రూ.30 లక్షలను ఇటీవల మృతి చెందిన ఎస్టీపీపీకి చెందిన కంబాల రాజేష్ కుటుంబాని రూ.50 లక్షల ప్రమాద బీమా చెల్లించింది.