21 May, 2026 | 2:41 AM

స్వర్ణకారులకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి

21-05-2026 12:12 AM

తెలంగాణ రాష్ట్ర స్వర్ణకార సంఘం డిమాండ్

ముషీరాబాద్, మే 20 (విజయక్రాంతి): స్వర్ణకారులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతోపాటు రూ.10 లక్షల వడ్డీలేని రుణాలు అందజేయాలని తెలంగాణ రాష్ట్ర స్వర్ణకార సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వింజమూరి రాఘవాచారి, చేపూరి వెంకటస్వామి మాట్లాడారు. రాష్ట్రం ఏర్పడి పన్నేండేళ్లు గడుస్తున్నా అట్టడుగు వర్గాలకు న్యాయం జరగడం లేదని అన్నారు.

జ్యూవెలరీ రంగంలోకి కార్పొరేట్ శక్తుల రాకతో ఉపాధి లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వాపోయారు. 50 ఏళ్ళు దాటిన స్వర్ణకారులకు రూ.4 వేల పెన్షన్ అందజేయాలని కోరారు. 2009లో అప్పటి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్వర్ణకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేశారని తెలిపారు. తద్వారా ఫైవ్ మెన్ కమిటీ ఏర్పాటు చేసి పక్క రాష్ట్రాలకు అధ్యయనానికి పంపారని గుర్తు చేశారు.

వైఎస్‌ఆర్ బ్రతికి ఉంటే స్వర్ణకార కార్పొరేషన్ ఏర్పాటు అయ్యేదన్నారు. ఆయన హయాంలో తెచ్చిన జీవో 272ను సవరించి అమలు చేయాలన్నారు. ఈ నెల 23న జరిగే కేబినెట్ మీటింగ్‌లో కార్పొరేషన్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవాలన్నారు. లేనిపక్షంలో అసెంబ్లీ ముట్టడితోపాటు 33 జిల్లాల్లో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సంఘం నేతలు చంద్రశేఖర్, కిషన్, మనోరమ, భీష్మాచారి, ఆంజనేయచారి, సంతోష్, వేణుగోపాల్ చారి, సతీష్ తదితరులు పాల్గొన్నారు.