21 May, 2026 | 3:49 AM

పోక్సో కేసులో నిందితుడికి 20 ఏండ్ల కఠిన కారాగార శిక్ష

21-05-2026 12:12 AM

రూ.50 వేల జరిమానా విధించిన ప్రత్యేక కోర్టు

మహబూబ్నగర్, మే 20 (విజయ క్రాంతి) : ఫోక్సో కేసులో వాని నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారకార శిక్ష విధిస్తూ కోర్టు తీర్పును వెలువరించింది. జిల్లా ఎస్పీ డి జానకి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లా కేంద్రం లోని బాలసదన్, మెట్టుగడ్డ ప్రాంతంలో మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో పోక్సో ప్రత్యేక కోర్టు నిందితుడికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.50,000 నగదు జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించినది.

నిందితుడు మున్నూరు లక్ష్మయ్య అలియాస్ లక్ష్మయ్య, తండ్రి చెన్నయ్య, వృత్తి రీత్యా చైల్ వెల్ఫేర్ కమిటీ (CWC) సభ్యుడిగా విధులు నిర్వహిస్తూ, కోయిలకొండ మండలం రాంపూర్ గ్రామానికి చెందినవాడు. విధుల నిమిత్తం బాలసదన్కు వచ్చిన సమయంలో మైనర్ బాలికను బెదిరించి, బలవంతంగా లైంగిక దాడికి పాల్పడినట్లు దర్యాప్తులో వెల్లడైనది. బాధితురాలు జరిగిన విషయాన్ని ఉపాధ్యాయులకు తెలియజేయడంతో 17.03.2024 నాడు మహబూబ్నగర్ రూరల్ పోలీస్ స్టేషన్లో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయబడినది.

అనంతరం పోలీసులు బాధితురాలి వాంగ్మూలాలు, వైద్య పరీక్షలు, ఫోరెన్సిక్ ఆధారాలు మరియు ఇతర సాక్ష్యాధారాలను సేకరించి పకడ్బందీగా దర్యాప్తు నిర్వహించి కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఈ కేసును విచారించిన స్పెషల్ కోర్ట్ ఫర్ పోక్సో కేసెస్ జడ్జి శతమన్ రాజరాజేశ్వరి నిందితుడిని దోషిగా తేల్చి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.50 వేల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు.

ఈ కేసులో సమర్థవంతంగా దర్యాప్తు నిర్వహించిన మహబూబ్నగర్ రూరల్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్, సర్కిల్ ఇన్స్పెక్టర్ గాంధీనాయక్, పోక్సో కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎం. జాన్, కోర్టు లైజన్ అధికారి ఏఎస్‌ఐ బాలకృష్ణ, కోర్టు డ్యూటీ అధికారులు పీసీలు కృష్ణ, రహీం, శంకర్, అశోక్ రెడ్డి కేసు దర్యాప్తులో పాల్గొన్న పోలీసు సిబ్బందిని ఎస్పీ డి.జానకి అభినందించారు.