25 April, 2026 | 1:50 AM

నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలి

25-04-2026 12:06 AM

ఎమ్మెల్యే కోవ లక్ష్మి

కుమ్రం భీం ఆసిఫాబాద్, ఏప్రిల్ 24(విజయ క్రాంతి): ఆసిఫాబాద్ నియోజకవర్గ అభివృద్ధి  నిధులు కేటాయించి సహకరించాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి శుక్రవారం డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మళ్లు భట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే మాట్లాడుతూ ఉట్నూర్‌ఆసిఫాబాద్ రహదారి పనులు కొనసాగుతున్న నేపథ్యంలో కాంట్రాక్టర్కు రావాల్సిన బకాయిలను వెం టనే చెల్లించి పనులు త్వరితగతిన పూర్తయ్యే లా చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు.

కెరమెరి, లక్మాపూర్ ప్రాంతాల్లో అసంపూర్తిగా ఉన్న బ్రిడ్జి నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయడానికి అవసరమైన నిధులు మంజూరు చేయాలని మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. బ్రిడ్జి పనులు పూర్తయితే స్థానిక ప్రజలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించి అంశాలను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. దీంతో పాటు ఆశ్రమ పాఠశాలల పరిస్థితిపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరుతూ గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ సంతోష్కు  ఎమ్మె ల్యే వినతిపత్రం అందజేశారు. ఇటీవల ఆశ్రమ పాఠశాలల్లో వైద్య పర్యవేక్షణ లోపం కారణంగా విద్యార్థులు అనారోగ్యానికి గుర య్యే ఘటనలు చోటుచేసుకుంటున్నాయని తెలిపారు.

పాఠశాలలకు సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుండి వైద్యులు వారానికి కనీసం ఒకసారి పాఠశాలలను సందర్శించి విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరినట్లు పేర్కొన్నారు. కెరమెరి మండలంలోని జంగుబాయి దేవస్థానం కమిటీకి 2024 సంవత్స రానికి సంబంధించిన రూ.10 లక్షల బకాయిలను విడుదల చేయాలని కూడా కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. సమస్యలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు.