నిజాయతీకి నిలువుటద్దం చొక్కారావు
బల్మూరి విజయసింహారావు
కరీంనగర్, విజయక్రాంతి: కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడటం.. పైరవీలకు దూరంగా ఉండే నాయకుడిగా ప్రజల మనిషిగా తుది శ్వాశ వరకు వెలుగొందిన గొప్ప నాయకుడు జువ్వాడి చొక్కారావు. కరీంనగర్ తొలి జిల్లా పరిషత్ చైర్మన్‌గా, కరీంనగర్ ఎమ్మెల్యేగా మూడుసార్లు, ఎంపీగా మరో మూడుసార్లు ఎన్నికైన నేత జువ్వాడి చొక్కారావు. విద్యార్థి నాయకుడిగా, ఆర్య సమాజ్ సారథిగా, హైదరాబాద్ రాష్ట్ర విమోచన పోరాటంలోను, రాష్ట్రంలో సహకార ఉద్యమంలోను ఆయన పాత్ర క్రియాశీలకం.
నాటి స్వాతంత్య్రోద్యమ పోరాటం మొదలు.. నక్సల్బరీ ఉద్యమం, తెలంగాణ తొలి దశ ఉద్యమాలను దగ్గరి నుంచి చూసిన జువ్వాడి చొక్కారావు నేటి తరం వారికి ఆదర్శం. వరుసగా 8, 9, 10వ లోక్‌సభ ఎన్నికల్లో విజయాలను సాధించి హ్యాట్రిక్ ఎంపీగా నిలిచారు. నిఖార్సయిన రైతాంగ ప్రతినిధిగా పేరు గడించారు. పార్లమెంట్‌లో వ్యవసాయ కమిటీ చైర్మన్‌గా దేశంలో వ్యవసాయ రంగ అభివృద్ధికి, రైతేరాజు అన్న నినాదాన్ని నిజం చేయడానికి అవసరమైన ప్రతిపాదనలను సూచించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన రైతుబాంధవుడు చొక్కారావు.
చొక్కారావు 1957లో కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి పీడీఎఫ్ అభ్యర్థి విఆర్ రావును ఓడించారు. ఆ తర్వాత 1962 జరిగిన ఎన్నికల్లో సోషలిస్ట్ అభ్యర్థి ఎ కిషన్‌రెడ్డి చేతిలో పరాజయం పొందారు. మళ్లీ 1967, 1972 జరిగిన ఎన్నికల్లో షెలస్ట్ అభ్యర్థి వి కిషన్‌రెడ్డి చేతిలో పరాజయం పొందారు. 1967, 1972 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు. 1978లో జనతా పార్టీ హవాలో ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి నల్లమాచు కొండయ్య చేతిలో ఓడిపోయారు.
ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల శాఖ, రవాణా, వ్యవసాయ, చక్కెర పరిశ్రమ, దేవాదాయ, కమాండ్ ఏరియా డెవలప్మెంట్ మంత్రిగా సేవలందించారు. 1984 లోక్‌సభ ఎన్నికల్లో గెలిచి పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. ఉమ్మడి రాష్ట్ర మాజీ ముక్షమంత్రి మర్రి చెన్నారెడ్డిని ఓడించిన ఘనుడు ఆయన. పివి నరసింహారావుకు అత్యంత సన్నిహితుడు. కరీంనగర్‌కు రైల్వే లైన్ తెచ్చిన నాయకుదు. ఆయన ఆర్భాటాలు లేకుండా సామాన్య జీవితం గడిపారు. ఢిల్లీలో బస్‌లో ప్రయాణించే వారు. కరీంనగర్ అంబాజిడర్ కారు అద్దెకు తీసుకుని పర్యటించే బారు. ఇలాంటి నేతలు నేడు మచ్చుకయినా కానరారు.






